పుట:Naajeevitayatrat021599mbp.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టాభి సీతారామయ్యగారు, ముట్నూరి కృష్ణారావుగారు, నేను ప్రాక్టీసు చేస్తూ ఎక్కువగా ధనం సంపాదించే కాలంలో మద్రాసు వచ్చి, నన్ను కలుసుకుని, "మద్రాసులో మీరు ఇంతకాలంనించీ న్యాయవాద వృత్తి సాగిస్తూ ధనం సంపాదిస్తున్నారు గదా! ఒక్క నాలుగు పేజీల పత్రిక ఇంగ్లీషులో అచ్చువేయించడానికి శక్తిలేదా?" అని అడిగారు.

వారు సహాయ నిరాకరణోద్యమ ప్రారంభ కాలంలోనే నాకు ఈ విధంగా సలహా ఇచ్చారు. అప్పటినించీ కూడా నా మనస్సులో అదే ఉండిపోయింది. న్యాయవాద వృత్తి వదలి పూర్తిగా ఉద్యమంలోకి దిగిన తరవాత నగర పరిస్థితులూ, నగరంలో ఉండే పత్రికల పరిస్థితులూ కనిపెట్టి వెంటనే ఇంగ్లీషులోనూ, దేశభాషల్లోనూ దినపత్రికలు స్థాపించడానికి నిశ్చయించుకున్నాను. పైన చెప్పిన స్నేహితులు అంతాకూడా అమితోత్సాహంతోనూ, త్యాగబుద్ధితోనూ ధనసహాయమూ, ఇంకా కావలిసిన ఇతర సహాయాలూ కూడా ఇచ్చి, పత్రిక నడిపించడానికి తోడ్పడ్డారు. అందుచేత ఎల్లాంటి కష్టమూ, లేకుండానే సంస్థ ప్రారంభించి, డబ్బు వసూలు చెయ్యడమూ, డబ్బు అంతా వసూలు కాకముందే కావలసిన సామగ్రి సేకరించడమూ కూడా జరిగాయి. మూడు లక్షలు వసూలు చెయ్యడంలో ఏవిధమైన కష్టమూ ఉండదని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. నా దగ్గిర బాంకులో ఉన్న సొమ్ము కరెంటు అక్కౌంటులో లేకపోయినా, గవర్నమెంటు ప్రొవిన్షియల్ నోట్లు మొదలైనవాటి రూపకంగా ఉండడంచేత అప్పు పుట్టడానికి ఏమీ ఇబ్బంది లేకపోయింది.

ఆ కారణంచేత, కంపెనీ మూలధనం మూడు లక్షలు వసూలు అయ్యేవరకూ కనిపెట్టుకుని ఉండక, నేనూ, టి. వి. వెంకట్రామయ్యరుగారు కలిసి, ఇండియన్ బాంకులో ఒక ప్రామిసరీనోటువ్రాసి, 30 వేల