పుట:Naajeevitayatrat021599mbp.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగరంలో న్యాయవాదవృత్తి వదిలినవారిలో టి. వి. వెంకట్రామయ్యరు అనే స్నేహితుడు కూడా ఒకడు. రాజగోపాలాచారిగారు కూడా అప్పుడే వారి న్యాయవాదవృత్తి వదులుకున్నారు. రాజగోపాలాచారిగారిని నేను మొట్టమొదట కలుసుకోవడమూ, ఆయనతో స్నేహం చెయ్యడమూ, కలిపి పనిచెయ్యడమూ, మొదలయినవి అన్నీ కూడా 1920, 21 సంవత్సరాలలోనే జరిగాయి. రాజగోపాలాచారిగారు గాంధీగారికి మొదటి శిష్యులుగా చేరిన కొద్దిమందిలో ఒకరు. ఆయన సేలంలో ప్రాక్టీసుచేస్తూ ఉండి, ఈ ఉద్యమం ప్రారంభించడానికి పూర్వం కొద్దికాలం కిందటే న్యాయవాదవృత్తికోసం మదరాసు వచ్చారు. రాజగోపాలాచారిగారు, నేను, టి. వి. వెంకట్రామయ్యరు గారు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రిగారు కలిసి కాంగ్రెసు ఉద్యమం బలపరచ డానికి ఒక దినపత్రిక స్థాపిస్తే తప్ప ముందు కార్యక్రమం నడపడం కష్టతరం అవుతుందని ఆలోచించాము.

అందుచేత ఇంగ్లీషులోనూ, క్రమంగా తెలుగులోనూ, అరవము మొదలయిన భాషల్లోను పత్రికలు ప్రచురించడం మంచి దని నిశ్చయించి ఒక లిమిటెడ్ కంపెనీ స్థాపించడానికి నిర్ణయించాము. శ్రీ కాశీనాథుని నాగేశ్వర్రావుగారు కూడా మాకు ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చారు. ముఖ్యులైన ప్రోత్సాహకుల్లో రాజగోపాలాచారిగారు ఒకరు. నేను హైకోర్టులో 15 సంవత్సరాలనించి ప్రాక్టీసు చెయ్యడంవల్లనూ, కావలసినంత ధన సహాయం ఉండడంచేతనూ, మద్రాసు వర్తకుల్లో హిందువుల్లోనూ, మహమ్మదీయుల్లోను కూడా పెద్దలైనవారు ఈ ప్రోత్సాహకులలో చేరి సహాయం చేశారు.

ఇంతమంది ప్రోత్సాహకులతో సంస్థ ప్రారంభించి, ఆర్టికల్స్