పుట:Naajeevitayatrat021599mbp.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యత అంటే ఏమిటో, నిజం అయిన ప్రజాస్వాతంత్ర్యం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో ఎరగనట్టి పరిస్థితుల్లో ఉండేది. మద్రాసు నగరంలో ఉన్న పత్రిక లన్నీ మితవాద పత్రికలే. అవి ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉండడమేగాని, ప్రజాస్వాతంత్ర్యమూ, జాతీయతా, త్యాగమూ మొదలైన వాటిని గురించి వ్రాయడానికి జడుస్తూఉండేవి.

మదరాసు బీచిలో జరిగిన పెద్ద బహిరంగ సభలో కాంగ్రెసు ఆదేశానుసారంగా నేను న్యాయవాదవృత్తి వదలివేశానని చెప్పినసంగతి మద్రాసు పత్రికల్లో ఎక్కడో మారుమూలగా చిన్న అక్షరాలలోవేశారు. ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వక పోవడానికి వాళ్ళ మనస్సుకి నూతన కార్యక్రమంలో నమ్మకం లేకపోవడం ఒక కారణము. అల్లాంటి సంగతులకి ప్రాముఖ్యం ఇస్తే ప్రభుత్వం ఏమి చేస్తుందో అనే భయం ఒకటి. అందుచేత, నాకు ఈ స్వల్ప వ్యవహారంలోనే ఈ పత్రికలకి ఇంత భయం ఉంటే, ముందు రాబోయే కార్యక్రమాన్ని గురించి ప్రకటించడానికి వాటికి ఏ మాత్రమూ సాహసం ఉండదనీ, పత్రిక సహాయం లేనిదే ఇంతటి మహోద్యమం ఈ రాజధాని అంతటిమీద నడిపించడం చాలా కష్టమనీ తోచింది.

అదివరకు మద్రాసు రాజధాని మితవాద నాయకత్వంలో ఉన్నప్పటికీ నూతన కార్యక్రమానికి సంసిద్ధులు అయినవారు లేరని ఎంత మాత్రమూ అనుకోడానికి వీలులేదు. కాంగ్రెసు నూతన కార్యక్రమం వెల్లడికావడంతోనే లోపల అంత వరకూ దాగి ఉన్న దేశభక్తి, త్యాగబుద్ధి మొదలైనవి మనుష్యులలోనించి బయటికీ రావడం సహజము. అందుచేత, మద్రాసులో నూతన కార్యక్రమం జరపడానికి ఎవరు సంసిద్ధులు? అనే విషయం తెలుసుకోవడానికి కూడా వెంటనే అవకాశం కలిగింది. మొట్టమొదటి పిలుపులో మద్రాసు లాయర్లలో ఎక్కువమంది ఇవతలికి రాకపోయినా, నేను ప్రచురణ చేసిన తరవాత నగరంలో అనేకమంది వారి వృత్తులు ఒదులుకున్నారు.