పుట:Naajeevitayatrat021599mbp.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలబడ్డాడు. ఆయన పెద్ద తలపాగా నేటికీ నా కళ్ళకి కట్టినట్లే ఉంది. కపర్ది తరవాత స్టేటు కౌన్సిల్ మెంబర్‌కూడా అయ్యాడు. తిలక్ ఉపపాదనకి ఎవ్వరో అడ్డుచెప్పేసరికి సభలో పెద్ద అల్లకల్లోలం ప్రారంభం అయింది. నేనైతే చూడలేదుగాని కపర్దీయే తన కాలిజోడు విసిరాడనీ, అది సంకేతంగా గ్రహించి నాగపుర ప్రతినిధులు గలాటా ప్రారంభించారనీ చెప్పుగున్నారు. నాగపురంనించి వచ్చిన ప్రతినిధులు లాఠీకర్రలు పుచ్చుకుని 'తిలక్ మహారాజుకీ జై!' అనుకుంటూ వేదిక మీదికి వురికారు. తరువాత గలాటా పెరిగి, ఉభయపక్షాల వాళ్ళూ కుర్చీలూ, బెంచీలు కూడా చేతబట్టి విజృంభించారు! అనేకమందికి గాయాలు తగిలి రక్తం స్రవించింది. అల్లరి ప్రారంభం అయిన ఒక్క క్షణంలో, పక్కనే కూర్చుని వున్న కృష్ణస్వామయ్యరుగారు లేచి పారిపోయారు. నటేశనుగారు, "కృష్ణస్వామయ్యరు ఏమయ్యా?" డని కంగారు పడుతూ నా దగ్గిరికి వచ్చాడు. మనకి యీలాంటి అల్లరులు కొత్తగాదు! కనక నేను అక్కడే నిలబడ్డాను. వేదికమీద వుండే నాయకులంతా ఒక్కొక్కరే దొడ్డిదారిని నిష్క్రమించారు. చివరికి ఆ కల్లోలం బాగా పెరిగి ఎవళ్ళమట్టుకి వాళ్ళు ఖాళీచేసి వెళ్ళి పోయారు.

తరవాత ఒకళ్ళమీద ఒకళ్ళు నిందారోపణులు చేసుకున్నారు. వాస్తవానికి ఉభయులు కొంత అల్లరికి సిద్ధపడే వచ్చారని నా అభిప్రాయము. గడబిడ జరిగేముందు తిలక్ పక్షీయుడు ఒకడు మాకు దగ్గిరగా వున్న ఒక ఆహ్వాన సంఘోద్యోగిని పిలిచి అతనికి ఒక రౌడీని చూపించి ఈ కాంగ్రెస్‌లో ఈ రౌడీకి ఎల్లాగ ప్రవేశం కలిగిందో చెప్పమన్నాడు. ఆహ్వాన సంఘంలో వున్న ఆ పెద్దమనిషి సరియైన సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలాడు. అందుచేతనే ఉభయులూ కూడా దీనికి సంసిద్ధులై వచ్చారని నే ననుకున్నాను.

పిరౌజిషా మెహతా రాజకీయంలో మితవాదే కాని గొప్ప దేశ భక్తుడు. ఇంగ్లీషువాళ్ళు అంటే ఆయనకి చాలా ఆగ్రహం. ఆయన వాళ్ళని చూస్తేనే కటకట పడేవాడు. ఈ అల్లరి అయిన కొంత