పుట:Naajeevitayatrat021599mbp.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సేపటికి ఆయన హాలు ఎదుట ఖాళీస్థలంలో కూర్చుని కొంచెం విచార గ్రస్తుడై మిత్రులతో భవిష్యత్తునిగురించి ఆలోచిస్తూ ఉండగా, శ్వేత ముఖుడైన ఒక పోలీసు ఉద్యోగి సిబ్బందితో తయారై, ఆయన దగ్గిరికి వచ్చి "ఇక్కడ ఏదో అల్లరి అయిందిట! దాన్ని గురించి ఏమైనా రిపోర్టు ఇస్తారా?" అని అడిగాడు. మెహతా ఆయనకేసి చురచుర చూసి, "ముందు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారో చెప్పు! ఇది అంతా గృహ కల్లోలమే! ఇక్కడ నీ ప్రసక్తి ఏమీ లేదు," అని చెప్పాడు. దాంతో ఆఫీసరు మెల్లి మెల్లిగా తగ్గి అక్కడినించి నిష్క్రమించాడు.

ఈ సందర్భంలో మన మద్రాసు నాయకుల సంగతి కొంచెం వ్రాస్తాను. సూరత్ సమావేశంలో అల్లరి జరగడానికి పూర్వం మన దొరస్వామయ్యరు గారూ, చక్రయ్యచెట్టిగారూ గోఖలేమీద ప్రశ్న పరంపరలు కురిపించి కొంత కలవరపరిచారు. అందుచేత వి. కృష్ణస్వామయ్యరు ప్రభృతులకి కష్టం కలిగింది. అందుచేతనే కృష్ణస్వామయ్యరుగారు యస్. శ్రీనివాసయ్యంగారి దగ్గిర అప్రెంటిస్‌గా ఉంటున్న దొరస్వామయ్యరుగారికి సర్టిఫికేటు యివ్వకుండా చేస్తానని బెదిరించడం జరిగింది. ఆ పని జరగలేదు కాని నాయకుల మనోవైఖరి ఎల్లా ఉండేదో చెప్పడానికి మాత్రమే ఈ సంగతి వ్రాస్తున్నాను. దొరస్వామయ్యరుగారు మంచి ధైర్యశాలి. తను నమ్మిన సిద్ధాంతాలు అంటే మంచి పట్టుదల ఉన్నవాడు. గొప్ప ప్రతిభాశాలి. ఆయన ఈ బెదిరింపులు లక్ష్య పెట్టలేదు. కాని ఆ కాలంలో మితవాదులు వాక్స్వాతంత్ర్యం అల్లాగే ఉండేది. రాజకీయకారణాలవల్ల జైలుకి వెళ్ళ వలసివస్తే సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యుడుగా ఉండడానికి కూడా వీలు లేదంటే, ఇక చెప్పేది ఏమిటి?

సూరత్తులో కాంగ్రెస్ రెండు చీలికలు అయింది. కాంగ్రెసుని చేతుల్లో పెట్టుకున్న మితవాదులు కొన్ని నియమాలు నిర్మించి, అతివాదుల బలం పెరగకుండా కట్టుదిట్టాలు చేశారు.