పుట:Naajeevitayatrat021599mbp.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పశువులకొట్టాలుగా మారిపోయాయి. అవి నేటికీ అక్కడక్కడ పొలాల్లో నిలిచే వున్నాయి. మాండలేలో 150 అడుగుల బౌద్ద విగ్రహం ఉన్న కొండ బర్మా బౌద్ధుల ఆరాధనకోసం సంపాదించ గలిగిన ఉకాంతి అనే ఆయన ఈ విషాదగాథ అంతా నాకు చెప్పాడు. ఆంగ్లేయులు ప్రతిచోటా ఈ తంతే జరిపించారు. రౌండు టేబిల్ సంపాదకుడయిన కర్టిన్ చెప్పినట్లు, తమ పరిపాలన సాగించడానికి అవసరమైన గుమాస్తాలనీ, ద్విభాషుల్నీ, వకీళ్ళనీ, యింకా యితర నౌఖర్లనీ తయారుచెయ్యడమే ఆంగ్లేయుల విద్యావిధానంలో వున్న పరమోద్దేశం ఒకవిధంగా మన విద్యావంతుల్ని ఆంగ్ల మానస పుత్రుల్నిగా తయారుచెయ్యడమే వారి ఆదర్శము. అప్పట్లో మన ప్రజలకి నాయకులుగా చలామణీ అయిన ప్లీడర్లు అంతా ఇల్లాంటి ఆదర్శం వల్ల ఉద్భవించినవాళ్ళే. దేశంలో ప్రజానీకాన్ని నిర్వీర్యం చేసి, శాశ్వతమైన బానిసలుగా తయారుచేసి బ్రిటిష్ సంస్థలకి అన్నింటికీ ఆంగ్ల విద్యాధికులే నిర్వాహకులు అయ్యారు. క్రమంగా ఈ నిర్వాహకులకి కూడా వాటి ఆంతర్యం గోచరం అవడంచేత కొంచెం ఆత్మగౌరవం రేకెత్తింది.

కాని, ఇంగ్లీషు పాలకులు అతి గడసరులు. కాంగ్రెసులో చేరి ప్రజానీకంకోసం ఎవరైనా పూనుకుంటే, వారికి ఏదోరీతిగా ఆశలు చూపించి, ఉన్నతోద్యోగాలు యిచ్చి, సంతృప్తిపరిచేవారు. కాంగ్రెస్సు ఉత్పత్తీ, వృద్ధీ యిప్పటికి బాగా లోకవిదితాలు అయ్యాయి కనక, యిక్కడ నేను వివరించదలచుకోలేదు. నేను ఇంగ్లండు వెళ్ళడానికి ముందుమాత్రం కాంగ్రెసు రాజకీయాలు నన్ను ఎక్కువగా ఆకర్షించలేదు. ఒకసారి నేను బొంబాయిలో వర్తకం చేస్తూవున్న గొల్లపూడి నరసింహం అనే ఒక లక్షాధికారి కేసుమీద బొంబాయినగరం సందర్శించాను. అప్పట్లో తీవ్రవాదిగా ప్రసిద్ధిపొంది, ప్రభుత్వపు ఆగ్రహానికి కూడా గురి అయిన లోకమాన్య తిలక్‌ని పూనానగరంలో దర్శించాను.

అప్పుడు ఆయనతో అనేకవిషయాలు చర్చించాను. అప్పటికి ఆయన రాజకీయాల్లో తీవ్రవాది. కాని, సాంఘికవిషయాల్లో కొంచెం