పుట:Naajeevitayatrat021599mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వాచార పరాయణుడు. అందుచేత వీరేశలింగంపంతులుగారి ప్రభకి లోనైన నాకు ఆయనతో విశేషంగా చర్చించవలసిన ఆవసరం కలిగింది. ఆయన నాకు హిందూమతం మూలసూత్రాలన్నీ చక్కగా వివరించి మన ఆచార వ్యవహారాల్లో వుండే ఆంతర్యాలన్నీ బోధించారు. కాని, నేను అప్పట్లో వాటిని అవగాహన చేసుకునే స్థితిలో లేను. ఇప్పటికి వాటి పరమార్థం గ్రహించాను.

అప్పుడే ఆయనకీ, గోఖలేకీ వివాదం జరుగుతూవుండేది. ఆయన తమకి యిద్దరికిన్నీ గల అభిప్రాయబేధాలు ఏమీ ఆగ్రహావేశాలు లేకుండా, గోఖలే అంటే అతిగౌరవంతో వ్యక్తపరిచారు. అప్పట్లో గోఖలే ఆయనమీద కక్ష సాధించడానికి చాలాకష్టపడినట్లుగానే అర్థం అయింది. ఆనాటినించీ నాకు గోఖలే అన్నా, ఆయన రాజకీయాలు అన్నా ఒకవిధమైన అనిష్టం బయలుదేరింది. తిలక్ మీద వచ్చిన ప్రోసిక్యూషన్లలోనూ, ఇతర కష్టాలలోనూ ఈ గోఖలే ప్రభృతులకికూడా కొంత బాధ్యతవుందని నేను అనుకున్నాను. కాంగ్రెసు రాజకీయాలు నన్ను అప్పట్లో ఆకర్షించక పోవడానికి ఇది ఒక కారణం. ఆనాటి కార్యక్రమంలోగాని, నాయకత్వం లోగాని నన్ను ఉత్తేజపరచినది ఏమీ లేదు. లాలా లజపతిరాయ్, తిలక్ వంటివాళ్ళకి ఆ పోకడలు వచ్చినా, వాళ్ళకి కాంగ్రెస్ సంస్థలో పలుకుబడి వుండేదికాదు.

నేను ఇంగ్లండులో బారిష్టరు చదువుకునే రోజులలో దాదా భాయి, శ్యాంజీకృష్ణవర్మ, వెడ్డర్ బర్న్, రమేశచంద్రదత్తు, డబ్లి యి. సి. బోనర్జీ వంటి ప్రముఖుల పరిచయభాగ్యం సంపాదించుకున్నాను. ఆ దేశంలో వుండే స్వాతంత్ర్య వాయువులకీ, మనదేశంలో వుండే నిర్బంధాలకీ గల తారతమ్యం కూడా కనుక్కున్నాను. స్వాతంత్ర్యం కోసం పెనగులాడిన ఇతర దేశాల చరిత్రలన్నీ జాగ్రత్తగా చదివాను. ఈ పై కారణాలవల్ల నా మనస్సు రాజకీయాలలో లగ్నమైన దని చెప్ప వలసి వుంది, కాని, అప్పట్లో ప్రజానాయకు లనేవారి ఆదర్శమే చాలా చిన్నది. స్వరాజ్యమూ, స్వాతంత్ర్యమూ ఆనే ఆశయాలే లేకుండా వుండేవి. అప్పట్లో లండనులో హిందూదేశాన్నిగురించి ప్రచారం