పుట:Naajeevitayatrat021599mbp.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుర్రవాణ్ణి అతనికి అప్పజెప్పి వెళ్ళిపోయాను. జానకిరామయ్య సలహామీద కలకత్తాలో ఉన్న కొందరు హోమియోపతీ వైద్యుల సలహాలు తీసుకున్నాను. కాని, ఈ లోగానే జానకిరామయ్య కృషివల్ల మాట వచ్చి చెవులుకూడా వినిపించడం మొదలు పెట్టాయి. అప్పటినించీ అతని వైద్యం అంటే నాకు నమ్మకం కుదిరింది. అనేకసార్లు అతను అలోపతీవల్ల కుదరని రోగాలు సాధించడం నేను ఎరుగుదును. ఈ వైద్యసాధనతో ప్రయోజకుడై జానకిరామయ్య సుఖంగా జీవయాత్ర సాగిస్తున్నాడు.

నేను రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు ప్రారంభించిన కొద్ది రోజులకే నా మేనల్లుళ్లు మైనంపాటి నరసింహం, సుబ్బారావు వగైరాలూ, వాళ్ళ చెల్లెళ్ళూ రాజమహేంద్రవరం చేరుకున్నారు. వాళ్ళందరి చదువూకూడా అక్కడే జరిగింది. నా మేనగోడళ్ళ పెళ్ళిళ్ళుకూడా నేనే చేశాను. అందరూ చదువుకుని ప్రయోజకు లయ్యాక, ఎవళ్ళంతట వాళ్ళు గుట్టుగా జీవితయాత్ర చేస్తున్నారు.

కుటుంబ విషయమైన ఈ ప్రస్తావన ముగించడానికి ముందు నా జీవితానికి వెలుగు యిచ్చిన హనుమంతరావు నాయుడుగారిని గురించి వ్రాయవలసి ఉంటుంది. నేను రాజమహేంద్రవరం ఛైర్మన్‌గా ఉన్న కాలంలో ఆయన్ని కౌన్సిలు సెక్రటరీగా నియమించాను. నేను ఇంగ్లండు వెళ్ళి బారిష్టరు పరీక్షకి చదవడానికి నిశ్చయించుకోవడం విని, ఆయన ఎంతో సంతోషించారు. నేను బారిష్టరుని అయి తిరిగి వచ్చాక, మద్రాసులో ప్రాక్టీసు పెట్టిన కొద్దిరోజులకి ఆయన్ని మద్రాసు తీసుకువచ్చి కొంతకాలం మా యింట్లో ఉంచుకున్నాను. అప్పట్లో ఆయనకి వంట్లో ఖాయిలా ప్రవేశించింది. ఆ ఖాయిలాకి చికిత్సకూడా చేయించాను. తరవాత కొంతకాలానికి ఆయన కీర్తిశేషులైనారు. ఆయన కుటుంబానికి నేను శక్తివంచన లేకుండా తోడ్పడ్డాను అనే తృప్తి ఉన్నప్పటికీ, ఆయన నా జీవిత భాగానికి చేసిన సేవ ఎన్నటికీ మరవలేను.