పుట:Naajeevitayatrat021599mbp.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

రాజకీయ జీవితం

నాకు అంతో యింతో వెలుగు యిచ్చింది రాజకీయ జీవితం. ఆ జీవితమే నేను ఆంధ్రదేశపు సద్భావం పొందడానికీ, ఈ చరిత్ర వ్రాయడానికీ కారణం అయింది. కనక ఈ విషయం కొంచెం విపులంగా వ్రాస్తాను. నేను ఆదిలో వృత్తి నిర్ణయం చేసుకునే కాలంలో నా దృష్టి ప్లీడరీమీదికి పోవడానికి కారణం వ్రాసే ఉన్నాను. అ కాలంలో ప్లీడర్లకి ఉండే ఆర్జన, హుందా తనమూ మాత్రమే కాకుండా ఆ వృత్తి స్వతంత్ర వృత్తి అనే నమ్మకంకూడా నన్ను అందులోకి ఈడ్చుకు వెళ్ళింది. హనుమంతరావు నాయుడుగారి శుశ్రూష, రాజమహేంద్రవరంలో వీరేశలింగంపంతులు సంస్కర ణోద్యమమూ, కొంతవరకు నాలో రాజకీయాభిలాషలు రేకెత్తించాయి. అప్పటికి 1857 వ సంవత్సరంనాటి స్వాతంత్ర్య యుద్ధపు కథలు యింకా ప్రచారంలోనే ఉన్నాయి. ఏమైనా, ఈనాటి మహదాశయాలు ఇదమిత్థ మని ఏర్పడకపోయినా, నాలో యితర లౌకికాభిలాషలతోపాటు దేశసేవ చెయ్యాలనే అభిలాషకూడా ఉండేది.

నేను రాజమహేంద్రవరంలో యఫ్. ఏ. క్లాసు చదువుకునే కాలానికి కాంగ్రెస్ అనే మాట కొంచెంగా వినబడేది. కాని, ఆ మాట వినిపించు కునేవాళ్ళ సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. నేను 1893 వ సంవత్సరంలో లా కాలేజీలో చదువుకునే రోజుల నాటికి కాంగ్రెస్ మరికొంత పేరు పాతుకుంది. అప్పుడే నేను మద్రాసులో బిల్లిగిరి అయ్యంగారి ఐస్‌హౌస్ భవనంలో శ్రీ వివేకానందస్వామిని దర్శించి ఆయనతో చాలాసేపు చర్చచేశాను. అప్పట్లో బిసెంటమ్మ వర్గంలోని ఓల్డు అనే ఆయన దివ్య దృష్టితో టెలిపతీవిషయాలు చెపుతూ ఉండేవాడు. ఆ విషయా లన్నిటి గురించీ వివేకానందస్వామిని అడిగి తెలుసుకున్నాను. మానవుడికి జ్ఞానం పరిపక్వం అయితే ఆలాంటివి అసాధ్య విషయాలు కావని ఆయన చెప్పారు. ఆయన ఉపన్యాసాలు నాకు కొంత ఉత్తేజం కలిగించాయి.