పుట:Naajeevitayatrat021599mbp.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిక్ష వేశారనుకుంటాను. ఆ కేసు నడిపించడంలో నాకు కొంత ప్రఖ్యాతి వచ్చింది. అదే క్రిమినల్ ప్రాక్టీసులో మొదటి కేసు.

నేను మొత్తం ప్రాక్టీసు చేసిన 14 సంవత్సరాల్లోనూ మొదటి 7 సంవత్సరాల్లో ప్రాక్టీసు బాగా నిలదొక్కుకున్నాను. కాని, అప్పుడు నెలకి రెండుమూడువేల దాకా సంపాదన ఉన్నా, ఖర్చుకూడా అల్లాగే ఉండేది. ఏమయినా బారిష్టరుచదువుకీ, దాని ఉపాంగాలైన లైబ్రరీ వగైరాలకీ అయిన ఋణం తీర్చివేశాను. నా మిత్రుడు లక్ష్మణదాసు ఇంగ్లండు ప్రయాణంకోసం ఇచ్చిన డబ్బు వెంటనే తీర్చివెయ్యవలసిన అవసరం వచ్చింది. అందుచేత, నేను ప్లీడరుగా ఉన్నప్పుడు చాటపర్రులో కొన్న భూమి అమ్మి ఋణం అంతా తీర్చివేశాను. లైబ్రరీకోసం కంచుమర్తి రామచంద్రరావు గారి దగ్గిర చేసి ఋణం అంతా ప్రాక్టీసులో సంపాదన వల్ల తీర్చివేశాను. ఈ కాలంలో కుటుంబం పరిస్థితిని గురించి ముందు ముందు వ్రాస్తాను. మొదటి 7 సంవత్సరాలూ ఇల్లా గడిచిన తరవాత, మిగిలిన 7 సంవత్సరాల్లోనూ పుష్కలంగా సంపాదించి తోటలు, దొడ్లు, బంగాళాలు కొన్నాను.

17

మాటపట్టింపులు

ఈ సందర్భంలోనే నేను ప్రాక్టీసుకి వచ్చినప్పుడు బారు సంగతుల్ని గురించీ, జడ్జీల కయ్యాళీలనిగురించీ, నాకూ వాళ్ళకీ వచ్చిన పట్టింపుల్నిగురించీ కొంచెం వ్రాస్తాను. చాలామంది జడ్జీలతో నాకు మాట పట్టింపు రావడమూ, నా మీద మాట ఉంచుకోకుండా వెంటనే వాళ్ళకి మాట అప్పజెప్పి, నా ఆత్మగౌరవమూ, స్వాతంత్ర్యమూ కాపాడుకోవడమూ జరిగాయి.

నేను మొదట్లో ప్రవేశించినప్పుడు - అంటే 1907 వ సంవత్సరంలో - మద్రాసు బారులో ఒక ఆచారం ఉండేది. ఒక పెద్ద ప్లీడరు హైకోర్టు జడ్జీ అవడంతోనే అతని జూనియర్‌గా ఉంటూ ఉండిన