పుట:Naajeevitayatrat021599mbp.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాయరు బారుకి నాయకుడై పలుకుబడి సంపాదిస్తూ ఉండేవాడు. అ ఆచారం కూడా నాకు మొదట్లో ఒక అడ్డే. నాకు అల్లాంటి ప్రాపకం లేదు. మొదటినించీ నాకు ఉన్న ధైర్యంతోనే అప్పటి హేమా హేమీలకి ఎదురుగా నిలబడేవాణ్ణి. అందులోనూ జడ్జీలుగా ఉండిన హేమా హేమీలు కేసులలో ముందే ఒక అభిప్రాయానికి వచ్చి లాయరుకి అడ్డు తగులుతూ శ్రమ కలగచేస్తూ ఉండేవారు. దాంతో లాయర్లకీ, జడ్జీలకీ కొంచెం తగాదాలు వస్తూ ఉండేవి. అందులోనూ, ఒక్కొక్కజడ్జీకి ఒక్కొక తిక్క ఉండేది. అందుచేత కాస్త స్వాతంత్ర్యం చూపించే లాయరుకి జడ్జీతో తగాదా తప్పేదికాదు. నేను వచ్చేసరికి జడ్జీలలో స్వతంత్రంగా ఉండే వాళ్ళలో నార్టు బాగా ప్రసిద్ధికి ఎక్కాడు.

నేను ప్రాక్టీసు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సర్ శంకరన్ నాయరు జడ్జీగా ఉండగా ఒక లిమిటేషన్ కేసు అప్పీలులో ఆర్గ్యుమెంటు చెపుతూఉన్నాను. ఆయన నేను చెప్పేది వినకుండానే ఇల్లాంటి కేసుల్లో ఇదివరకే చాలాపర్యాయాలు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి నాకు అడ్డుతగిలాడు. వెంటనే నేను అందుకుని, "ఇల్లాంటి కేసు ఎప్పుడూ ఈ హైకోర్టులో తీర్పుకాలేదు. సరిగదా, మీరు అసలే తీర్పు చెప్పలేదు. మీరు అనుకునే కేసుకీ దీనికీ అసలు సంబంధమే లేదు," అని చెప్పాను. అంతటితో ఆయన చల్లబడ్డాడు.

ఇంకొక సారి వాలస్‌తో వచ్చింది తగాదా. ఆయన లాపాయింటు గ్రహించడంలో సునిశితబుద్ధికలవాడే కాని, యథార్థం (Fact) గ్రహించడంలో నిదానం ఉండేది కాదు. ఎంత బుద్ధిశాలి అయినా యథార్థం గ్రహిస్తేనే కాని న్యాయం జరగదు. లా యథార్థాన్ని అనుసరించే ఉంటుంది. కనక అది గ్రహించి న్యాయం చెప్పాలి. పైగా, ఈ వాలస్ నిద్రపోయేవాడు. ఒకసారి ఆయన బెంచీమీద నిద్రపోయాడు. నేను కాగితాలు కిందపడవేసి కూర్చున్నాను. కొంచెం సేపటికి ఆయన మేలుకుని "Mr. Prakasamǃ Where are We?" అన్నాడు. నేను, "My lordǃ I don't know where we areǃ" అన్నాను. దానికి ఆయన చాలాబాధపడ్డాడు. అక్కణ్ణించి నేను హాజరయిన కేసుల్లో