పుట:Naajeevitayatrat021599mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకటేశ్వరరావుగారు, తన అల్లుడైన పి. వెంకటరమణారావుగారిని - (ఇప్పుడు జస్టిస్) - నాతో పనిచెయ్యడానికి అప్పగించారు. అప్పటికి వెంకటరమణారావుగారు బి. యల్. పాసయినారు. ఆయన మంచి చురుకైన బుద్ధిశాలి. ఆయనకి ఉన్న జ్ఞాపక శక్తి చాలాగొప్పది. కేసుల్లో చాలా గట్టివాడు. సివిల్ కేసుల్లో లా పాయింట్లు తీసి, వాటిని క్షుణ్ణంగా జడ్జీ ఎదటపెట్టి, కేసులు గెలవడానికి నాకు ఆయనవల్ల లభించిన సాహాయ్యం చాలా గొప్పది.

క్రిమినలు సైడున నేను మొట్ట మొదట పనిచేసిన పెద్దకేసు ఆష్ హత్యకేసు. అది రాజకీయమైన కేసు. 1907-8 సంవత్సరాల్లో తిరునల్వేలిలో కలెక్టరుగా ఉండిన ఆష్‌ని ఎవరో రైలుస్టేషనులో రివాల్వరుతోకాల్చి చంపివేశారు. అప్పటికి బిపినచంద్రపాలు మన రాష్ట్రానికి రావడమూ, ఆయన ఉపన్యాసాలు దేశంలో గాఢమైన దేశాభిమానాన్ని రగులుకొల్పడమూ జరిగాయి. అవి వందేమాతరం రోజులు. వంగ విభజనవల్ల భారత జాతీయత రగుల్కొల్పబడింది. ఇది ఆ గందరగోళంలో వచ్చిపడిన కేసు! ఆ కేసులో మొదటి ముద్దాయి తరపున బారిష్టరు దేవదాసు, రెండవ ముద్దాయి శంకరకృష్ణన్ తరపున నేనూ వకాల్తా పుచ్చుగున్నాము. అసలు తిరునల్వేలిలో జరిగిన ఈ హత్య విచారణ సహజంగా తిరునల్వేలిలోనే జరగవలసి ఉంది. కాని రాజకీయ కారణాల చేత, ఆ కేసు మద్రాసు హైకోర్టువారే - అందులోనూ పుల్ బెంచివారు - విచారించారు. అల్లాంటప్పుడు ఆ కేసు నడిపించడం ఎంత కష్టమో వేరే చెప్పనక్కరలేదు. పుల్ బెంచికి అధ్యక్షుడు చీఫ్ జస్టిస్ సర్ ఆర్నాల్డు వైటు. ఆ విచారణలో నేను జడ్జీలని చాలా శ్రమ పెట్టాను! అడుగడుక్కీ డిఫెన్సు తరపున హక్కులు స్థాపించుకుంటూ, వాళ్ళప్రాణాలు విసిగించే వాణ్ణి. పోలీసులు F.I.R. లో ఆ దొరని కొట్టినవాడికి క్రాపింగు ఉందని వ్రాసి తరవాత సవరించుకున్నారు. నా క్లయింటుకి పెద్ద జుట్టు ఉండేది. ఆ పాయింటు పట్టుకుని సాగదీసే సరికి చాలా లాభించింది! పర్యవసానంలో నా క్లయింటుకి రెండు సంవత్సరాల