పుట:Naajeevitayatrat021599mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాను ఓడలో పడవేయించి నేను పి. ఒ. బోటులో వచ్చేశాను. అయిన ఖర్చు ఎల్లాగ అయింది కనక, ఒకటవరకమైన లైబ్రరీకూడా ఉంచాలని సంకల్పించాను. నేను 1906 వ సంవత్సరం చివరికి భారత దేశం చేరుకున్నాను. కొందరు మిత్రుల దగ్గిర ఋణంచేసి లా పుస్తకాలు విడుదల చేయించాను. సకుటుంబంగా చెన్నపట్టణం చేరి కొండిచెట్టి వీథిలో 25 రూపాయిల అద్దెమీద ఒక చిన్న ఇల్లు కుదుర్చుకున్నాను. లైబ్రరీకీ, ఆఫీసుకీ మాత్రం ఒక విశాలమైన హాలు కుదుర్చుకున్నాను.

14

మైలాపూరు మేధావులు

అప్పట్లో మైలాపూర్ వకీళ్ళ ప్రభ బాగా వెలిగిపోతూ ఉంది. భాష్యం అయ్యంగారు మద్రాసుబారుకి నాయకుడు. సర్ సుబ్రహ్మణ్యయ్యరు జడ్జీ. పి. ఆర్. సుందరయ్యరు పెద్ద వకీలుగా పేరుపడ్డాడు. ఇక కృష్ణస్వామయ్యరు అట్టహాసానికి పరిమితేలేదు. అప్పటికి బారిష్టర్ల కి ప్రాక్టీసు, పలుకుబడి కూడా తగ్గాయి. జాన్ ఆడమ్సు, న్యూజంటు గ్రాంటు, పెర్సీ గ్రాంటు, బ్రాన్సన్, వెడ్డర్ బర్ను మొదలైనవాళ్ళు కొద్దిమంది గుట్టుగా కాలక్షేపం చేస్తూవచ్చారు. సుప్రసిద్ధుడైన నార్జన్ అప్పటికే క్రిమినలులో బాగా పెద్దపేరు సంపాదించుకున్నారు. అల్లాంటి వాడికి క్రిమినలులో పనేలేదు. అప్పటికి మైలాపూరులో ఉన్న ఈ ప్రముఖులూ, ఎగ్మూరులో ఉన్న టి. వి. శేషగిరయ్యరు, శంకరన్‌నాయరు ప్రభృతులూ రెండు ముఠాలుగా ఉండి పోటీలు పడుతూ ఉన్నట్లు అనుకునేవారు. వీళ్ళమధ్యచేరి ప్రాక్టీసు పెట్టడం అంటే చాలా సాహసం అని మిత్రులు అనేవారు. కాని నాకు, "మొదటినించీ లా విషయంలో ఒక విధంగా సమగ్రమైన కృషిచేసి ఉన్నాంగదా! దానికి తగిన శ్రమతీసుకుంటే ఎందుకు అభివృద్ధిలోకి రామూ?" అని ఒక విశ్వాసం!