పుట:Naajeevitayatrat021599mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డబ్బుకి కూడా దెబ్బతగిలింది. అప్పుడు బహుమతిగా సంపాదించుకున్న 50 పౌనులే గతి అయ్యాయి. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు యూరోపు అంతా సంచారం చెయ్యాలని బుద్ధిపుట్టింది. అప్పుడు చాటపర్రులో మిత్రుడు లక్ష్మణదాసు అనే ఆయన కావలసిన డబ్బు పంపించాడు.

మద్రాసులో జడ్జీగా ఉండిన షెప్పర్డుతో నాకు పరిచయం అయిన సంగతి ఇదివరకే వ్రాశాను. ఎందుకైనా మంచిదని ఆయన్ని మద్రాసులో ఉండే జడ్జీలకి పరిచయం చేస్తూ ఉత్తరాలు ఇమ్మని అడిగాను. ఆయన లేదనలేక పోయాడు. కాని, ఉత్తరాలకి సరియైన మన్నన కలుగదేమో అనే అనుమానం ఆయన్ని బాధించింది. అప్పుడు మద్రాసులో సర్ సుబ్రహ్మణ్యయ్యరు ఒక జడ్జీ. షెప్పర్డు "ఆయన మైలాపూర్ కూటంలో వాడు. ఆయనకి నేను ఉత్తరం వ్రాస్తే మాత్ర మన్నిస్తాడా?" అన్నాడు. చివరికి అంటీ అంటని మాటలతో సర్ సుబ్రహ్మణ్యయ్యరుగారికీ, జస్టిస్ వాలస్‌కీ కూడా ఉత్తరాలు ఇచ్చాడు.

బారిష్టరు పైనల్ పరీక్షకి చదివే రోజుల్లోనే భవిష్యత్తుని గురించి కొంత ఆలోచించడం జరిగింది. బారిష్టరై మళ్ళీ రాజమహేంద్ర వరంలో ప్రాక్టీసు పెట్టడమా అనే సంశయం ప్రారంభం అయింది. చాలాకాలం అచ్చటి స్థానిక రాజకీయాల్లో కొట్టు మిట్టయిన నాకు అ ఊరంటే ప్రాణం విసిగింది. మళ్ళీ అదే ఇరుకులో పడకూడ దనిపించింది. అసలు బారిష్టరు చదువు చదివి కాస్త విశాలమైన అవరణలో బ్రదుకుదామని వెళ్ళాను. అల్లాంటప్పుడు రాజమహేంద్రవరంలో తిరిగి బారిష్టరుగా ప్రవేశించి స్థానికమైన గందరగోళాలలో పడకుండా ఉండడానికే నిశ్చయించుకున్నాను. అందుచేత ఏమైనా సరే మద్రాసులో ప్రాక్టీసు పెట్టడానికి నిశ్చయించుకుని షెప్పర్డు దగ్గిర పైన చెప్పిన ఉత్తరాలు తీసుకున్నాను. రాజమహేంద్రవరంలో ఉన్న నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు కూడా నేను తొక్కినదారి మంచిదని అంగీకరించారు.

ఈ నిశ్చయంతోనే సెకండ్‌హాండు లా పుస్తకాలు అమ్మే షాపులికి వెళ్ళి, స్వల్పంగా అడ్వాన్సు ఇచ్చి, సుమారు 10 వేల రూపాయల ఖరీదయిన అపురూపపు లా పుస్తకాలు కొన్నాను. వాటిని అన్నింటినీ