పుట:Naajeevitayatrat021599mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షెప్పర్డు ఇచ్చిన పరిచయం ఉత్తరం పట్టుకుని, సర్. సుబ్రహ్మణ్యయ్యరు దగ్గిరికి వెళ్ళి దర్శనం చేశాను. ఆయన నన్ను ఎగాదిగా చూసి ఇక్కడ బారిష్టర్లకి ఏమీ ప్రయోజనం ఉన్నట్టు లేదని పెదవి చప్పరించాడు. చివరికి షెప్పర్డు అనుమానించినట్లే చేశాడు. తరవాత వాలస్‌ని చూశాను. ఆయన నన్ను ఆదరణతో పరిశీలించి "ప్రకాశం గారు! బారిష్టర్లకి ఇక్కడ చోటు ఉన్నట్టు కనిపించదు. ఈ మైలాపూరు వకీళ్ళముందు వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళ పలుకుబడీ, ఆర్భాటమూ చాలా హెచ్చు. ఆ కృష్ణస్వామయ్యరుని చూడండి! కోర్టుకి నాలు గుర్రాల బండిలో వస్తాడు! వాళ్ళతో మీరు ఏమి వేగ గలుగుతారు!" అని అన్నాడు. ఆపైన "మీరు ఏమైనా ధనవంతులా?" అని అడిగాడు. నేను 'బీదవాణ్ణే' అని చెప్పిన మీదట, ఆయన "మీరు ఎక్కడయినా ఒక చిన్న పట్టణంలో ప్రాక్టీసు చెయ్యండి. చూడండి! మైలాపూర్ దాటి కాగలేక పి. సి. లోబో మళ్ళీ మధుర చేరుకున్నాడు!" అని నిరుత్సాహ పరిచాడు. అందుమీద నేను కొంచెం ధైర్యం తెచ్చుకుని "అయ్యా, మీదేశం వెళ్ళి ఈ బారిష్టరీ చదివి వచ్చిన తరవాత కూడా నేను ఎక్కడ ప్రాక్టీసు పెట్టాలో నిర్ణయించుకో లేకపోతే నా చదువు వృథాయే! నేను ఇక్కడే ప్రాక్టీసు పెడతాను. అది నా నిశ్చయం! నాకేమి ఆర్భాటాలు అక్కరలేదు! అదిగో హైకోర్టు కెదురుగా అక్కడే 25 రూపాయలు అద్దె ఇచ్చి ఒక చిన్న ఇంట్లో ఉంటాను. నాకు పని ఎందుకు రాదో చూస్తాను!" అని చెప్పివచ్చాను.

అప్పట్లో మైలాపూరులోని దాక్షిణాత్య మేధావుల ప్రతిభని గురించి కొంచెం విస్తరిస్తాను. భాష్యంఅయ్యంగారు అడ్వొకేటు జనరల్. ఆయన అప్పటికే కొంచెం పెద్దవాడు అయ్యాడు. చాలా స్వతంత్రుడు. తనకేసు తగిన శాస్త్రాధారలతో నిదానంగానూ, విపులంగానూ జడ్జీ ఎదట పెట్టగలిగేవాడు. బారులోనూ, బెంచిమీదకూడా మంచి గౌరవానికి పాత్రుడు అవుతూ వుండేవాడు. లాలో మంచి పండితుడు. ఒక సారి ఒక తుందుడుకు జడ్జీ ఆయన ఆర్గ్యుమెంటు చెప్పబోతూ ఉంటే అడుగడుక్కీ అడ్డు తగిలాడు. వెంటనే ఆయన చేతులో ఉన్న పుస్త