పుట:Naajeevitayatrat021599mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రమే. వరేష్ అనే ఒకాయన ఆంగ్ల స్త్రీని పెళ్ళాడి అక్కడే బారిష్టరుగా ప్రాక్టీసు చేస్తూవుండేవాడు. ఆయన ఒకరోజున నా గదికి వచ్చి నేను కాయగూరలు వండుకు తింటూవుంటే చూసి, "ఏమండీ! ఈ చలిదేశంలో మాంసాహారాలు తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సుమండీ!" అని హడలగొట్టాడు.

10

రాజకీయాలతో పరిచయం

ఆయనే అప్పుడు లండన్‌లో ఉంటూ ఉండిన 'లండన్ ఇండియన్ సొసైటీ'లో నన్ను మెంబరుగా చేర్చారు. రాజకీయమే ప్రధానమైన నా జీవితంలో రాజకీయ స్వాతంత్ర్యం విషయమై ఆకాంక్ష అప్పుడే ఉదయించిన రోజులనవి. ఇంగ్లీషువారు ఈ పవిత్ర భూమిని అక్రమంగా ఆక్రమించుకొన్నారనీ, మళ్ళీ మన జన్మభూమి స్వాతంత్ర్యంకోసం వంగ రాష్ట్రంలోని విప్లవకారులు సాహసచర్యలు చేస్తున్నారని నాకు తెలుసును. వాళ్ళ కథలన్నీ నా మనస్సులో ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో లోకమాన్య బాలగంగాధరతిలక్ మహాశయుడి స్వాతంత్ర్య సంపాదనా కృషి, రాంచ్‌హత్య, తిలక్ మహారాజుమీద కేసు, మొదలయిన విషయాలు నా మనస్సులో బాగా నాటుకుని ఉన్నాయి. తిలక్, గోఖలేల అభిప్రాయభేదాలు, వాళ్ళకీ, ఫిరోజిషా మెహతా ప్రభృతుల మధ్య వుండే పోటాపోటీలు కూడా నేను తెలుసుకున్నాను. పంజాబ్‌లో లాలాలజపతిరాయ్ కృషి, ఆయన అనుభవించే కష్టాలు నన్నాకర్షించాయి. కాంగ్రెసు పుట్టి అప్పటికి 17, 18 సంవత్సరాలు అయింది. దేశాభ్యుదయంకోసం ఆ సంస్థపడుతూ ఉన్న శ్రమ నే నెరుగుదును. అయితే బెంగాలులో విప్లవకారులు, పశ్చిమదేశంలో తిలక్ మహాశయుడూ, ఉత్తరదేశంలో లజపతిరాయీ, నన్ను బాగా ఆకరించారు.