పుట:Naajeevitayatrat021599mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్రాసులో రిక్షాబళ్ళవాళ్ళలాగు కాకుండా పట్టణం అంతా బాగా తెలుసుకుని ఉంటారు. దానికి తోడుగా వాళ్ళు మంచి నిజాయితీ ఉన్నవాళ్ళు.

ఒకసారి నేను నా లా పుస్తకం ఒకటి గుఱ్ఱపు బండిలో మరిచిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్ళాక ఆ దేశంలో సి. ఐ. డి. పోలీసులకి హుజార్ ఆఫీసు అయిన స్కాట్లండు యార్డుకి తెలియపరచాలని అనుకుంటూ ఉండగా కొన్ని గంటలలో పుస్తకం నా గదిలోకి వచ్చిపడింది. జరిగింది ఏమిటంటే - ఆ గుఱ్ఱపుబండివాడు ఆ పుస్తకం పోలీసులకి అప్పచెప్పాడు. ఆ పోలీసులు నా చిరునామా తెలుసుకుని పుస్తకం నాకు పంపించారు. మనదేశంలో లాగు యజమాని ఫలానా అని నిర్దారణ చేసే ఐడెంటిఫికేషన్ హంగామా ఏమీ చెయ్యలేదు.

ఇల్లాంటి చిన్న విషయాలే నాకు ఆంగ్ల జాతీయ జీవనం మీదా, నీతి వర్తనంలోనూ బాగా గాఢాభిమానం కలిగించాయి. ఆ అభిప్రాయలతోనూ, అభిమానంతోనూ వెనక్కి తిరిగి మనదేశం సంగతి తలుచుకుంటే నిస్పృహ కలిగింది. "ఎప్పటికైనా మన ప్ప్రజాసామాన్యం ఈ ఔన్నత్యానికి రాగలదా?" అని బాధ కలిగింది. అప్పట్లో నా మనస్సు నా ఒక్కడిదేకాదు. అది నా సమకాలికు లందరిదీని! అదీగాక ఒక కొత్త వింతలాగ పాశ్చాత్యనాగరకతను అత్యంత వ్యామోహంతో చూస్తూవుండే రోజులవడంవల్ల కూడా నా కీ నిస్పృహ కలిగింది. తరవాత నా అనుభవం వల్ల మనదేశంలో మన జాతిలో కూడా ఒకప్పుడు ఇల్లాంటి నీతినియమాల ఔన్నత్యం ఉండేదనీ, మాట ఘరానా ఒకటేగాని, ఇచ్చి పుచ్చుకోవడాలలో రాతకోతలు, రిజిస్టరీలు లేవనీ తెలుసుకోగలిగాను. తమ స్వార్థంకోసం ఆంగ్ల రాజనీతిజ్ఞులు తమ సభ్యత్వ పద్దతులు అసంపూర్తిగా మన నెత్తిని రుద్ది, మన సభ్యతను మరిపించడంవల్లనే మన జాతికి పతనం కలిగిందని కూడా తెలుసుకున్నాను. ఈ విషయాలు ఇంకొక సందర్బంలో వ్రాస్తాను. ఈ విధమైన అభిప్రాయాలతో ప్రారంభించిన బారిష్టరీ చదువు మొదటి టెరము పూర్తి అయింది.

లండనులో నాకు మొట్టమొదట పరిచితులు అయిన భారతీయులు డెల్గాడో అనే గోవా సొలిసిటరూ, వరేష్ అనే పార్సి బారిష్టరూ