పుట:Naajeevitayatrat021599mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, "ఇప్పటిలాగ ఈ దేశం ఒకసంస్థ యాజమాన్యం కిందకి వచ్చి ఒక నాయకుడి కింద ఇంతటి ఏకీభావంతో ఉండడం నా జీవితంలో చూడగలుగుతానా!" అనే సంశయం మాత్రం నన్ను బాధిస్తూ ఉండేది. ఇల్లాంటి అభిప్రాయాలు మొలకెత్తి ఆ విషయమైన ఆలోచనలో వుండే సమయంలో ఇంగ్లండులో లండన్ ఇండియన్ అసోసియేషన్ చేరడం తటస్థించింది. అప్పటికి ఆ సభలోని ప్రముఖులలో దాదాభాయి నొరోజీ ముఖ్యుడు. ఆయన అప్పటికే ఇండియన్ పోవర్టీ (Indian poverty) అనే గ్రంథం రచించాడు. ఆ గ్రంథం అంతా, సమగ్రంగా చదివేసరికే నాకు దేశంలోని దరిద్ర నారాయణుల స్వరూపం గోచరించింది.

దాదాభాయి నొరోజీ కాంగ్రెసు స్థాపకులలో ఒకడై దేశాన్ని ఏకటాకీగా నడిపించడానికి కృషిచేసి, ఇంగ్లండులో కూడా పనిచేసి, ఇంగ్లీషు ప్రజలకి దాని నిజస్థితి తెలియ జెయ్యడానికి ఆదేశం చేరాడు. అక్కడ ఎంతో కష్టపడి పలుకుబడి సంపాదించి పార్లమెంటు మెంబరు కూడా కాగలిగాడు. బెంగాలులో సివిలియన్‌గా వుండి, పించన్ పుచ్చుకుని, కాంగ్రెసు స్థాపకుల్లో ఒకడైన సర్ హెన్రీ కాటనూ, బొంబాయి సివిలియన్ అయి, కాంగ్రెసు స్థాపకులలో ఒకడయిన సర్ విలియమ్ పెడర్‌బర్‌న్నూకూడా ఈ సంఘానికి ప్రధానులు. బెంగాలులో ఐ. పి. ఎస్. వుద్యోగంచేసి రిటైర్ అయి అనేక గ్రంథాలు వ్రాసిన రమేశచంద్రదత్తు, కాంగ్రెసు ప్రథమాధ్యక్షుడైన డబ్ల్యు. సి. బోనర్జీ కూడా ఆ సంఘంలోనే ఉండేవారు. అప్పుడే నేను దత్తు వ్రాసిన 'ఇకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా' అనే పుస్తకం చదివాను.

దాంతో నాకు ఆంగ్ల పరిపాలన యెడల విముఖత్వమూ, భారత స్వాతంత్ర్య సంపాదన యెడల ఆకాంక్షా హెచ్చు కావడంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఈ లండన్ ఇండియన్ అసోసియేషన్‌లో చక్కని లైబ్రరీ ఉండేది. ఇందులో ప్రాన్సు, ఇంగ్లండు, అమెరికా మొదలైన వివిధ దేశాల్లో ప్రజాస్వామికం కోసమూ, ప్రజల స్వాతంత్ర్యం కోసమూ జరిగిన పోరాటాల గాథల్ని గురించిన గ్రంథా లెన్నో