పుట:Naa Kalam - Naa Galam.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయకుడు ప్రజలనుంచే ప్రభవిస్తాడు"

అప్పటికి ఇంకా ప్రధానిగా శ్రీ పి.వి నరసింహారావు ఎంపిక కాలేదు. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్‌ కొనసాగుతున్నారు. పి.వి. జాన్‌ 21న కాని ప్రధాని కాలేదు.

"నెహ్రూ-గాంధి కుటుంబం పట్ల భారతీయులకు ఇంతగా గౌరవాభిమానాలకు కారణ మేమిటి?" అని మరో ప్రశ్న.

"భారత స్వాతంత్య్రోద్యమంలో ఆ కుటుంబం చేసిన త్యాగం, ఆ కుటుంబ సభ్యుల దేశభక్తి, వారి నాయకత్వ వైశిష్ట్యం - ఈ దేశ ప్రజలను ఎప్పటికప్పడు నడిపిస్తూనే ఉన్నాయి. వారే కాదు-నిష్కళంక దేశ భక్తులను, త్యాగధనులను ఏ దేశంలోనైనా గౌరవిస్తారు. నెహ్రూ - గాంధి కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రజాభీష్టం ప్రకారం నాయకత్వ పగ్గాలను చేబూనుతున్నారు. ప్రజాస్వామ్యంలో వంశపారంపర్య పాలనకు అవకాశంలేదు. ప్రజలు ఎన్నుకుంటేనే ఎవరైనా పాలనా పగ్గాలను పుచ్చుకోగలరు. 1977లో ఇందిరా గాంధిని కూడా భారత ప్రజాస్వామ్యం ఓడించింది!" అని చెప్పాను.

ఇదంతా కలిపి, జపాన్‌ టి.వి. వారు ఒక ఆరు నిమిషాల డాక్యుమెంటరీగా నిర్మించి,అమెరికా, జపాన్‌లలో ప్రసారం చేశారు!

జపాన్‌ టి.వి. ప్రయివేటు సంస్థ వారు ఎంతో వ్యయ ప్రయాసలతో మండుటెండలో విజయవాడ వచ్చి, నాతో ఇంటర్‌వ్యూ జరిపి డాక్యుమెంటరీని నిర్మించి, దాన్ని అమెరికా, జపాన్‌లలో ప్రదర్శిస్తే, అక్కడి ప్రభుత్వాలు వారికి "రాయల్టీ" చెల్లించాయి. మన దేశంలో ఢిల్లీలోని దూర దర్శన్‌ వారిని "శ్రీ రాజీవ్‌ గాంధి పై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారం చేస్తారా?" అని అడిగితే, మన దూర దర్శన్‌ వారు "మాకెంతయిస్తారని" అడిగారట!