పుట:Naa Kalam - Naa Galam.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జపాన్‌ టి.వి. వారు నిర్మించింది ఈ దేశ యువ ప్రధాని రాజీవ్‌ గాంధి డాక్యుమెంటరీ ! మన దూర దర్శన్‌ ప్రభుత్వ సంస్థ. ఆ ప్రభుత్వానికి మాజీ ప్రధాని-దివంగత రాజీవ్‌ గాంధి.

మన దూర దర్శన్‌ వైఖరి జపాన్‌ టి.వి. వారికి వింతగా, బాధాకరంగా కనిపించి, వారు మన దూర దర్శన్‌కు డాక్యుమెంటరీని ఉచితంగా యివ్వలేక పోయారట. ఈ విషయాన్ని ఆ తరువాత నేను ఢిల్లీ వెళ్లినప్పుడు జపాన్‌ రాయబార కార్యాలయం వారే నాకు చెప్పారు. నాకు వారు ఒక పార్కర్‌ పెన్నును బహూకరించారు.

కాగా, ఏతావాతా రాజీవ్‌ గాంధి డాక్యుమెంటరీని భారత దేశంలో ప్రసారం చేసే అవకాశం కలగలేదు ! అయినా, అది నెహ్రు - గాంధి కుటుంబంతో నా "లేఖా బాంధవ్యా"నికి సాక్షీ భూతంగా విదేశాలలో నిలిచిపోయింది !

గిన్నిస్‌ బుక్‌ ఎడిటర్‌ అభినందనలు

"తుర్లపాటి కలానికి, గళానికి పోటీ పెడితే, ఏది గెలుస్తుందో చెప్పడం కష్ట"మని మహా కవి, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆఖరు ఆస్థానకవి శ్రీదాశరధి ఒకసారి నా సన్మాన సభలో అన్నారు.

" తుర్లపాటికి ఇంత పేరు రావడనికి మూడు "పి"లు కారణం - పిక్చర్‌, పెన్‌, ప్లాట్‌ ఫామ్‌" అని మరో సారి నా సన్మాన సభలోనే అప్పటి అధికార భాషా కమిషన్‌ చైర్మన్‌, ప్రపంచ ఆర్య మహాసభ అధ్యక్షుడు శ్రీ వందేమాతరం రామచంద్ర రావు అన్నారు.

"పిక్చర్‌" అంటే సినిమాలు, "పెన్‌" అంటే రచనలు, "ప్లాట్‌ఫామ్‌" అంటే ఉపన్యాసాలు అని వేరే చెప్పనక్కరలేదు.