పుట:Naa Kalam - Naa Galam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుట్టినిల్లు), పామర్రు, గన్నవరంలలో గడిచింది.

అన్నట్టు, మా అన్నదమ్ములం ముగ్గురం, అక్క చెల్లెళ్లు ఇద్దరు. నా పైన అన్న, అక్క, నా తరువాత తమ్ముడు, చెల్లెలు. పైన ఇద్దరు, కింద ఇద్దరి మధ్య నేను! అందువల్లనేనేమో, నాది జీవితంలో ప్రతి విషయంలోను "మధ్యమ" మార్గమే! నా ఆలోచనలు, వైఖరి, అభిప్రాయాలు అన్నింటిలో మధ్యే మార్గంగా వుండేవి. అటు అతివాదం కాదు, ఇటు మితవాదం కాదు, మధ్యమ వాదం!

పామర్రు హైస్కూలులో చదువుతున్నప్పుడు డిబేటింగ్‌ సొసైటి చర్చలలో నేను ఒక వైపు వాదించే వాడిని. ముఖ్యంగా ఫోర్త్‌ ఫారంలో డిబేటింగ్‌ చర్చలు జోరుగా వుండేవి. ఇప్పటి నా గొంతు, ఉపన్యాస ధోరణి, వాదనా శైలి అప్పుడు అబ్బినవే. ఫోర్త్‌ ఫారం "బి" సెక్షన్‌లో ఆడపిల్లల సంఖ్య హెచ్చు. వారిలో స్వరూపరాణి అనే అమ్మాయి చురుకైనది, తెలివైనది. మా ఇద్దరికీ అన్నింటిలో పోటీ; అది స్నేహ పూర్వకమైన పోటీ. పాఠం కానివ్వండి దానిలో వచ్చే పద్యాలు కానివ్వండి - తడుముకోకుండా అప్పచెప్పాలి! అందులో నేనే విజేతను! అందువల్ల, ఆడపిల్లలకు నాపట్ల అభిమానం. ఏ ఉపాధ్యాయుడైనా పాఠం చెబుతుంటే, దానిలోని పేర్ల కోసం తడుముకుంటున్నప్పుడు నేను ఆయనకు వెంటనే అందించే వాడిని! అందువల్ల, తక్కిన విద్యార్ధులు నాకు "ఎల్‌.టి. సపోర్టర్‌" అని పేరు పెట్టారు. ఎల్‌.టి., బి.ఇ.డి. - పట్టభద్రులైన ఉపాధ్యాయులకు విద్యాబోధనకిచ్చే డిగ్రీలు.

ఆ అలవాటు ఇప్పటికీపోలేదు!

నీలం సంజీవరెడ్డికి అందించిన మాట

1959లో విజయవాడలో పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్‌లో పెద్ద సభ. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రధాని నెహ్రూ ఉపన్యాసాన్ని తెలుగులోకి