పుట:Naa Kalam - Naa Galam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఆంధ్రప్రభ", ఆంధ్రపత్రిక - రెండే ప్రధాన దినపత్రికలు. అందులోను శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో మద్రాసు నుంచి వెలువడే "ఆంధ్రప్రభ"లో ఆయన రాసే సంపాదకీయాలు నన్ను ఆకర్షించాయి. ఏ కారణంవల్లనైనా పత్రిక రావడం ఆలస్యమైతే, అది వచ్చే వరకు ఏమీ తోచేది కాదు! నార్ల వారి సంపాదకీయాలను, వాటిశైలిని ఆ చిన్న వయస్సులోనే హృద్గతం చేసుకున్నాను.

ఆ శైలే వేరు, ఆ వాక్య రచనా రీతే వేరు; ప్రతి వాక్యం వచన కవితే! నా దృష్టిలో సంపాదకీయాన్ని అలా రాయగలిగిన వారు తెలుగులో ఇంత వరకు కనిపించలేదు! నేను అప్పుడే నార్ల గారికి "ఏకలవ్య శిష్యుణ్ణి" అయ్యాను. నేను కూడా ఆయన వలె పత్రికా సంపాదకుణ్ణి కావాలి! ఆయన వలె సంపాదకీయాలు, వ్యాసాలు రాయాలి! శ్రమించి, తపస్సువలె తపించి, ఆయన శైలిని పట్టుకున్నాను. అదే తుర్లపాటిలోని "జర్నలిస్టు" జననం! ఆ "జర్నలిస్టు" వయస్సు ఇది రాస్తున్న సమయంలో 65వ సంవత్సరం నడుస్తున్నది!

అదే నా పునర్జన్మ! ఆ అస్వస్థతకు "పూర్వపు జన్మ"లో నేను జర్నలిస్టును కావాలని కాని, కాగలనని కాని కలలో కూడా అనుకోలేదు. కాకపోతే, నాన్న గారు లాయర్‌ కాబట్టి, విద్యార్ధిగా వుండగానే మా క్లాస్‌ డిబేటింగ్‌ సొసైటిలో నావాగ్ధాటిని విన్న వారు నాన్న గారి వలె నేను కూడా న్యాయవాదిగా రాణించగలనని అంటూ వుండడం వల్ల నేను కూడాలాయర్‌ను కావాలని అనుకుంటూ వుండేవాణ్ణి.

నాన్న గారి స్వస్థలం కృష్ణాజిల్లాలోని గుడివాడ సమీపంలోగల పామర్రు. ఆ వూరు అటు 'నట సామ్రాట్‌' అక్కినేని నాగేశ్వరరావు గారి స్వగ్రామం వెంకట రాఘవాపురానికి, ఇటు 'నటరత్న' ఎన్‌.టి. రామారావు గారి స్వస్థలం నిమ్మకూరుకు మధ్యలో వుంటుంది. నా బాల్యం బెజవాడ (అమ్మ శేషమాంబ