పుట:Naa Kalam - Naa Galam.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దాదాపు రెండు లక్షలకు పైగా జనం వచ్చారని అంచనా. బహుశా రాష్ట్రంలోని పట్టణాలన్నింటికంటె ఆ రోజులలో "సినిమా మోజు" హెచ్చుగా వున్న పట్టణం సింహపురి (నెల్లూరు అసలు పేరు) అని చెప్పవచ్చు. చివరికి థియేటర్ల సముదాయానికి ఎదురుగా వున్న రైలు పట్టాలపై కూడా జనం కూర్చున్నందున, నెల్లూరుకు వచ్చిపోయే రైళ్లను కూడా ఆపి వేశారు!

సభాధ్యక్షుడుగా నేను అంత మహా జన సందోహానికి ఒక్కసారి "కుదుపు" యిద్దామనుకున్నాను! ఆ మహా జన సందోహంలో అందరి కళ్లు ఎన్‌.టి.ఆర్‌ పైనే, ఆయనే ప్రధాన ఆకర్షణ!

నేను ఎన్‌.టి.ఆర్‌.ను పరిచయం చేస్తూ, ఒక్కసారిగా మహోచ్చ స్వరంతో "ఎన్‌.టి.ఆర్‌.ను కొట్టగలిగినవాడు చిత్రసీమలో ఒకే ఒక్కడు వున్నా"డనే సరికి ఒక్కసారిగా అంత జన సందోహం మ్రాన్పడిపోయారు! ఇదేమి? ఎన్‌.టి.ఆర్‌.ను కొట్టగలిగిన వాడు ఒక్కడే వున్నాడని ఎన్‌.టి.ఆర్‌. సమక్షంలో, ఆయన వీరాభిమానులైన తమ ముందు అనడమా? యావత్తు జనం నాపైకి వురకడానికి సిద్ధంగా వున్నట్టు అనిపించింది! ఎన్‌.టి.ఆర్‌. తెల్లని ముఖం ఎర్రబడింది! ఈ సన్నివేశానికి ఆందోళన పడిపోతున్న శ్రీ మల్లెమాల నా దగ్గరకు గబగబావచ్చి, "ఇదేమిటి కుటుంబరావు గారూ! మీకేమైనా మతి పోయిందా? ఏమిటా మాటలు! జనం మీ మీదకు వురికేట్టున్నారు. చూడండి!" అన్నారు ఆందోళనతో! నేను చిరు నవ్వుతో "రెడ్డి గారూ! మీరు చూస్తూ వుండండి. ఏమి జరుగుతుందో!" అని నేను వెంటనే "ఎన్‌.టి.ఆర్‌.ను కొట్ట గలిగినవాడు - ఎన్‌.టి.ఆర్‌. ఒక్కడే!" అని ఆ ముడి విప్పేసరికి ఒక్క నిమిషం పాటు ప్రశాంత నిశ్శబ్ద గంభీర వాతావరణంలో వున్న సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయింది! ఎర్రబడిన ఎన్‌.టి.ఆర్‌. ముఖం తిరిగి చిరునవ్వుతో వెలిగిపోయింది!