పుట:Naa Kalam - Naa Galam.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నెల్లూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆ తరువాత పార్లమెంటు సభ్యులైన శ్రీ మాగంటి సుబ్బరామిరెడ్డి "కృష్ణ, కావేరి, కళ్యాణి" అన్న పేర్లతో మూడు సినీ థియేటర్లు నిర్మించారు. ఆ థియేటర్ల సముదాయానికి ప్రఖ్యాత సినీ నటుడు శ్రీ ఎన్‌.టి. రామారావు చేత ప్రారంభోత్సవం చేయించాలని ఆయన నిర్ణయించారు. సభకు నన్ను అధ్యక్షునిగా ఆహ్వానించాలని నిర్ణయించి, నన్ను పిలవడానికి శ్రీ సుబ్బరామిరెడ్డి, ప్రఖ్యాత సినీ నిర్మాత, కవీంద్రులు, రచయిత శ్రీమల్లెమాల విజయవాడ మా ఇంటికి వచ్చారు. శ్రీ మల్లెమాల (డాక్టర్ మల్లె మాల సుందరరామిరెడ్డి) స్వస్థలం కూడా నెల్లూరే.

అంతకు పూర్వం విజయవాడలో 1975 డిసెంబర్‌ 12,13,14 తేదీలలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఫాన్స్‌ అసోసియేషన్‌ రజతోత్సవాలలో నా వ్యాఖ్యానాలను, వాటికి వచ్చిన ప్రజా ప్రతిస్పందనలను స్వయంగా చూచిన శ్రీ సుబ్బరామిరెడ్డి తమ మూడు థియేటర్ల ప్రారంభోత్సవ సభకు నేను అధ్యక్షతవహిస్తే బాగుంటుందని భావించారట. విజయవాడ సభలకు మూడు రోజులూ డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారే అధ్యక్షులు. ఆయన శ్రీ సుబ్బరామిరెడ్డికి పినమామగారు!

నెల్లూరు సభకు హేమా హేమీలు విచ్చేశారు. డాక్టర్ గోపాలరెడ్డి, శ్రీ మల్లెమాల, నాటి రాష్ట్రమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డి, మద్రాసు నుంచి ఎందరో సినీ ప్రముఖులు, తారలు వచ్చారు. సరే, శ్రీ ఎన్‌.టి. రామారావు థియేటర్‌ సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు.

ఏమి జనం! ఏమి ప్రజా సందోహం! ఏమా ఆనందోత్సాహాలు! అంతకు పూర్వం 20 సంవత్సరాల క్రితంగాని ఎన్‌.టి.ఆర్‌. ఆ సినీ నగరానికి రాలేదట! మరి, రెండు దశాబ్దాల తరువాత వచ్చిన ఆ అందాల "నటరత్నాన్ని" తిలకించడానికి ఒక్క నెల్లూరు నుంచే కాక, ఆ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి