పుట:Naa Kalam - Naa Galam.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పులిచింతల ప్రాజెక్టు గురించి రంగా గారి అభిప్రాయానికి భిన్నంగా ఆ పత్రిక సంపాదకుడు శ్రీ శివలెంక శంభు ప్రసాద్‌ రాసిన సంపాదకీయం ప్రసక్తి వచ్చింది. సంభాషణక్రమంలో రంగా గారు "మీ శంభు ప్రసాద్‌....." అన్నారు. నేను వెంటనే "మా శంభు ప్రసాద్‌ అంటే?" అని చటుక్కున, అప్రయత్నంగా ఎదురుప్రశ్న వేశాను! రంగాగారు కొంచెం చిన్నబోయి "అబ్బే, మన ఆంధ్రుడన్న అభిప్రాయంతో అన్నాను" అని సమాధానమిచ్చారు.

"మీ శంభు ప్రసాద్‌" అంటే "మీ సామాజిక వర్గానికి చెందిన" అనే అభిప్రాయాన్ని నేను తీసుకున్నాను. ఎందువల్లనంటే, నా జర్నలిస్టు జీవిత ప్రారంభంలోనే భవిష్యత్తులో నా వ్యక్తిత్వం ఎలా వుండాలి? నేను ఏ సిద్ధాంతాలకు కట్టుబడి వుండాలి? అని కొన్ని నీతి నియమాలను, కట్టుబాట్లను నా జీవితానికి నిర్దేశించుకున్నాను. వాటిలో "జాతి, మత, కుల, వర్ణ, వర్గ స్త్రీ పురుష విభేదాలకు అతీతమైన, మానవుడు మానవునిపట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించే మానవీయ వ్యవస్థ ఆవిర్భవించాలన్నది నా అభిమతం; అదే నా మతం కూడా. అందువల్ల నన్ను ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి చెందినవాడుగా ఇతరులు పరిగణించడం కాని, నన్ను నేను పరిగణించడం కాని నేను సహించలేను! నేను "విశ్వమానవుణ్ణి" అన్న భావన నా శరీరంలో అణువణువునా జీర్ణించి పోయింది! 1997లో నాకు ఇంగ్లాండ్‌లోని ఇంటర్నేషనల్‌ బయాగ్రఫికల్‌ సెంటర్‌ "ఇంటర్నేషనల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు" యిచ్చినప్పుడు నేను ఎంతో సంతోషించాను!

అందువల్ల, నన్ను ఎవరైనా కుల భావనతో చూస్తే, నేను సహించలేను. రంగా గారు "మీ శంభు ప్రసాద్‌" అని కుల భావనతో అని వుండకపోవచ్చు. బహుశా నేనే తొందరపడి వుండవచ్చు. ప్రకాశం గారిని నా గురువుగా, రంగా గారిని నా చిన్న గురువుగా భావించేవాడిని. ఎందువల్లనంటే,