పుట:Naa Kalam - Naa Galam.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశంగారి కంటె రంగా గారు దాదాపు మూడు దశాబ్దాలు చిన్న వారు. ఒకసారి రంగాగారే అన్నారు - ప్రకాశంతో తన సంబంధం "తండ్రీ కొడుకుల సంబంధం వంటి"దని! రంగా గారు కూడా నన్ను తన కుమారుని వలెనే ఎంతో వాత్సల్యంతో, గౌరవంగా చూచేవారు.

1988లో జరిగిన నా జర్నలిస్టు జీవితం 40వ వార్షికోత్సవ సభకు 89 సంవత్సరాల వయస్సులో ఆచార్య రంగాగారు ఢిల్లీ నుంచి వచ్చి అధ్యక్షత వహించారు.

అంతేకాదు - ఆ సభలోనే నాకు "పద్మశ్రీ" అవార్డు ఇవ్వాలని తీర్మానించారు. సభాధ్యక్షులుగా రంగాజీ ఆ తీర్మానంపై సంతకం చేసి, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధికి పంపించారు. అప్పుడు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీకి రాజీవ్‌గాంధి లీడర్‌ అయితే, ఆచార్య రంగా డిప్యూటీ లీడర్‌.

ఇక్కడ మరొక విశేషం కూడా చెప్పాలి. ఆ తరువాత ఆచార్య రంగా స్నానాలగదిలో జారిపడి, వెన్నెముక దెబ్బతినడంతో మంచంపై వున్నప్పుడు అప్పటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు ఆయనను పరామర్శించడానికి వెడితే, ప్రధాని తన వద్ద వున్న కొద్ది నిమిషాలలోనే రంగా గారు నాకు "పద్మశ్రీ" ఇంకా రాని విషయం జ్ఞాపకం చేసి, వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవంనాడైనా ఇవ్వాలని కోరారు! అంతేకాదు - ఆ విషయం నాకు తెలియజేస్తూ అప్పటికి 90 సంవత్సరాలు దాటిన ముదిమి వయస్సులో నాకు స్వయంగా కార్డు రాశారు! ఏమి నాయకులు వారు! ఏమి నీతి నిజాయితీలు వారివి! ఇప్పుడు అలాంటి నాయకులను చూడగలమా?

"ఎన్‌.టి.ఆర్‌. ను కొట్టగలిగేవాడెవరు?"

1980 జూలైలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆ నెలలో