పుట:Naa Kalam - Naa Galam.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పట్టాభికి పంపాను. ఆయన వెంటనే "చాలా బాగుంది" అంటూ నాకు కార్డు రాశారు. దానిలో పట్టాభి గారిని గురించి కొన్ని విమర్శలు వున్నాయి. అయినా, ఇంతకు పూర్వమే రాసినట్టు, అప్పటి నాయకుల హుందాతనం అలాంటిది! ఇప్పుడైతే, ఆ పుస్తకం కాపీని బుట్ట దాఖలు చేస్తారు!

1958లో కాబోలు, విజయవాడలో శ్రీ అయ్య దేవర కాళేశ్వరరావు జన్మదినోత్సవం జరుగుతున్నది. ఆ సభకు డాక్టర్ పట్టాభి ముఖ్య అతిథి. నేను ఒక ఉపన్యాసకుణ్ణి. నా ఉపన్యాసానికి ముందు అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి "ముంద్రా కుంభకోణం"లో ఇరుక్కున్నందున, తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు రేడియో వార్తలలో అప్పుడే చెప్పారు.

ఇదే అదను అనుకుని, నేను ఆ అవకాశాన్ని వుపయోగించుకుని, ఆ తరువాత ఉపన్యాసానికి నావంతు రాగానే "కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి గారు రాజీనామాచేసినట్టు ఇప్పుడే వార్త వచ్చింది. నిజానికి, డాక్టర్ పట్టాభిగారు స్వతంత్ర భారత ప్రథమ మంత్రివర్గంలోనే ఆర్ధిక మంత్రి కావలసింది. ఆయన గాంధేయ ఆర్ధిక వేత్త. స్వతంత్ర భారత ప్రభుత్వం గాంధేయ ఆర్ధిక విధానాలను అమలు పరచాలంటే, గాంధీజీకి అనుంగు శిష్యుడైన పట్టాభిగారే ఆర్ధిక మంత్రి కావాలి. కాబట్టి, ఇప్పుడైనా ప్రధాని నెహ్రూ మన పట్టాభిగారిని ఆర్ధికమంత్రిగా నియమించా"లని నేను అనే సరికి సభ యావత్తు హర్షధ్వానాలతో దద్దరిల్లింది!

ఆ తరువాత సభలో ముఖ్య అతిథిగా పట్టాభిగారు ప్రసంగించాలి. ఆయన లేచి, ముందుగా నా సూచన గురించే ప్రస్తావించారు. "మిత్రుడు కుటుంబరావు గారు (అప్పటి నాయకులు ఎంత గొప్పవారైనా, తమ కంటె చాలా చిన్నవారిని కూడా గౌరవంగా సంబోధించేవారని ఇది వరకే రాశాను) నాకు కేంద్ర ఆర్ధిక మంత్రి పదవి ఇవ్వాలని నెహ్రూకు "సిఫారసు" చేశారు!