పుట:Naa Kalam - Naa Galam.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


"మీరు ఎంతో చరిత్ర సృష్టించారు! మీ చరిత్ర కాకపోయినా, మీరు సృష్టించిన చరిత్రనే "చరిత్రకారుని చరిత్ర" అన్న పేరుతో రాయండి". అని శర్మ గారు సమాధానమిచ్చారు! ఆ సమావేశ ఫలితమే దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రశ్నల రూపంలోనే మిగిలిపోయిన నా స్వీయ గాథ ఈ గ్రంథంరూపం ధరించింది.

అయితే, ఇది కేవలం నా "ఆత్మ కథ" కాదు. అలా అని ఇందులో నా స్వవిషయాలు బొత్తిగా లేకపోతే బాగుండదని, నా వ్యక్తిగత విశేషాలు తెలుసుకోవాలని కోరే ఆత్మీయులు కొందరైనా వుంటారని, అక్కడక్కడ నా స్వ విశేషాలు కూడా దీనిలో చొప్పించం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆరు దశాబ్దాలకు పైగా విస్తరించిన నా పాత్రికేయ, ఉపన్యాసక జీవితంలో ఎదురైన ఆసక్తికరమైన సంఘటనలు, ఘట్టాలను మాత్రమే పేర్కొంటున్నాను.

ఈ 65 సంవత్సరాలుగా నా జర్నలిస్టు జీవితంలో అలాంటి ఆసక్తికర సంఘటనలు వందలాదిగా వుండవచ్చు. వాటినన్నింటిని క్రమ పద్ధతిలో, వరుసగా రాయడం కూడా సాధ్యం కాదు. వెనుక జరిగినవి ముందు, ముందు జరిగినవి వెనుక - వరుసక్రమంతో సంబంధం లేకుండా ఆ సంఘటనలు దర్శనమిస్తాయి. నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ సంఘటనలను గ్రంథస్థం చేస్తున్నాను. కొన్ని చోట్ల అనివార్యంగా పునరుక్తులు కూడా వుండవచ్చు. ఈ గ్రంథస్థమైన సంఘటనలు నాకు తెలిసినవీ, జ్ఞాపకమున్న వీ కొన్ని మాత్రమే. వీటికి రెట్టింపు నాలో మిగిలిపోయి వుండవచ్చు. అందుచేత, ఇది ముగింపు కాదు; ఇది అంతులేని కథం! దీని ముగింపు నాతోనే!

ఎంతో కాలంగా ఈ కథంకు గ్రంథరూపం ఇవ్వాలని అనుకుంటు న్నప్పటికీ, నా జర్నలిస్టు జీవిత వజ్రోత్సవం సందర్భంగా నా జ్ఞాపకాలకు, అనుభవాలకు అక్షర రూపమివ్వగలుగుతున్నందుకు ఆనందిస్తున్నాను.