పుట:Naa Kalam - Naa Galam.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముందు మాట

"నన్ను ఆత్మ కథ రాయాలని పదే పదే పెద్దలు - డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి గారి దగ్గర నుంచి నా సన్మాన సభలలో పాల్గొన్న ప్రముఖు లెందరో ఎప్పటి కప్పుడు నాపై ఒత్తిడి తెస్తూనేవున్నారు. అయితే, 'ఆత్మ కథ రాయడానికి అంత కథ నావద్ద లేదే!' అని ఆ పెద్దలతో వినమ్రతతో చెబుతూ వచ్చాను!

కాని, ఇటీవల జర్నలిస్టు మిత్రులనేకమంది, కొందరు రాజకీయ ప్రముఖులు "ఎందరో రాజకీయ, సినీ, సాహితీ ప్రముఖులతో మీరు కలిసిమెలిసి తిరిగారు. ప్రధానులు, ముఖ్యమంత్రులందరితో మీకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సందర్భంగా మీకు ఎన్నో అనుభవాలు, ఆసక్తికర సంఘటనలు ఎదురై వుంటాయి. మీకు మాత్రమే తెలిసి, ఇతరులకు తెలియని ఎన్నో వింతలు, విశేషాల భాండాగారం మీ వద్ద వున్నది. అవి ఎవ్వరికీ తెలియకూడదనా మీ వుద్దేశం? అవి మీకు మాత్రమే పరిమితం కావాలనా మీ అభిప్రాయం? మీ "తదనంతరం" వాటిని ఎవరు చెప్పగలరు?" అంటూ వచ్చారు.

కాగా, ఇటీవలనే నేను ఒక పెద్దల సమావేశంలో "ఆంధ్రపత్రిక" మాజీ సంపాదకులు, 90 సంవత్సరాల పాత్రికేయ భీష్మాచార్యులు శ్రీ మద్దాలి సత్యనారాయణ శర్మ గారిని, ఇంకా దాదాపు అదే వయస్సులో వున్న పాత్రికేయ ప్రముఖులను, మేధావులను కలిశాను. అక్కడ పిచ్చాపాటి మాట్లాడే సమయంలో వారికి జ్ఞాపకంలేని, రాని కొన్ని విషయాలను నేను అందించేసరికి శ్రీ శర్మ గారు "అలాంటి, అందరూ మరచిపోయిన సమాచారాన్ని, విశేషాలను మీరే చెప్పగలరు. మీరు ఆత్మకథ రాస్తే, మా అందరికీ ఎంతో ఉపయోగకరం కాగలదు" అనే సరికి నేను " నా కథ ఏ పాటిదని ఆత్మ కథ రాయమంటారు?" అని మళ్లీ పాత ప్రశ్ననే వేశాను!