పుట:Naa Kalam - Naa Galam.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిష్యుడనయ్యె! నేను కూడా వెళ్లిపోతే ఎలా? ఆయన స్పూర్తి, సైమన్‌ కమిషన్‌ నాటి ఉదంతం ఆ క్షణాన నామదిలో మెరిశాయి. నేను మొండికేసి (అప్పటికి ఇంకా వివాహం కాలేదు లెండి!) ఆ గాంధి విగ్రహం వద్దనే నిలబడ్డాను - ఒక్కడినే! నా మిత్రుడు, నా వలెనే "ఆంధ్రకేసరి" వీరాభిమాని అయిన శ్రీ దాసరి పాపారావు మాత్రం నన్ను ఒంటరిగా వదల లేక, తాను నాతో వుండలేక, అక్కడికి కొంచెం దూరంలో వున్న మామిడి చెట్టు నీడలో నిలబడి, "కుటుంబరావు గారూ! రండి! వెదాం!" అంటూ కేకలు వేస్తున్నారు!

ఇంతలో సబ్‌ కలెక్టర్‌ శ్రీ తాడేపల్లి వేదాంతం కారులో రానేవచ్చారు. అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూచి, కారును వేగంగా నూజివీడు పోనిద్దామనుకున్నారు. నేను కారు నెంబరు చూసి, అడ్డంగా నిలబడ్డాను. ఆ పక్క పక్కలనే వున్నవారు తక్కిన వారు కూడా నాకు బాసటగా వచ్చారు.

ఇంతచేస్తే, జిల్లా కలెక్టర్‌ గారు సబ్‌ కలెక్టర్‌ గారికి కాల్పుల ఉత్తరువులు ఇవ్వలేదట! "ఇప్పటికే తాడేపల్లిగూడెం, ఏలూరు మొదలైన చోట్ల కాల్పులు జరిగాయి. ఇక, కాల్పులు వద్దని ముఖ్యమంత్రి గారు ఉత్తరువు చేశారు". అని కలెక్టర్‌ గారు సబ్‌ కలెక్టర్‌కు చెప్పారని మాకు తరువాత తెలిసింది! అందువల్ల, సబ్‌ కలెక్టర్‌గారే స్వయంగా కారు దిగి, మేము చెప్పిన నినాదాలు చేసే సరికి మేమందరం ఆయనతో సంతోషంగా కరచాలనం చేశాము!

'ఆంధ్రకేసరి! ప్రత్యక్షం!

మేము అలా కార్లను ఆపుతూ వుండగా, ఏలూరు వైపు నుంచి ఒక కారు వస్తున్నది. మేము ముందుగానే దానికి అడ్డంగా నిలబడ్డము. తీరా కారు దగ్గరకు వచ్చి ఆగేసరికి, దానిలో ఎవరున్నారు? సాక్షాత్తు "ఆంధ్రకేసరి" ప్రకాశం గారు! మేమందరం ఆశ్చర్యానందాలతో "ఆంధ్రకేసరి" జిందాబాద్‌! "ఆంధ్రకేసరి" జిందాబాద్‌! అంటూ నినాదాలు చేశాము.