పుట:Naa Kalam - Naa Galam.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారికి చెప్పి, నేను తిరిగి "ఆంధ్రజ్యోతి"లో మరిన్ని బాధ్యతలతో, ముఖ్యంగా సంపాదకీయ రచయితగా చేరాను. ఆ తరువాత 1991 చివరి వరకు "ఆంధ్రజ్యోతి"లో సహాయ సంపాదకుడుగా, సంపాదక హోదాలోను పనిచేశాను. శ్రీ నార్ల "ఆంధ్రజ్యోతి" ఎడిటర్‌గా వున్నంత వరకు ఆయనతోపాటు శ్రీ నండూరి, నేను సంపాదకీయాలు రాసేవారం. శ్రీ నార్ల 1971 చివరలో "ఆంధ్రజ్యోతి" నుంచి విశ్రాంతి కోసం హైదరాబాద్‌లో స్వగృహం "లుంబిని"కి వెళ్లిపోయారు. ఆయన "ఆంధ్రజ్యోతి" నుంచి పూర్తిగా విరమించుకున్న తరువాత ఆ పత్రికలో దాదాపు 20 సంవత్సరాల వరకు శ్రీ నండూరి, నేను తప్ప ఆ పత్రిక సంపాదకీయ కాలంలో మరొక కలానికి చోటు లభించలేదంటే ఆశ్చర్యమే, మరి!

"వార్తలలోని వ్యక్తి"

"ఆంధ్రజ్యోతి" దినపత్రికలో నేను 1991 చివరి వరకు పని చేశాను. ఆ పత్రిక సంపాదకీయ రచయితగా, సండే ఎడిషన్‌ ఇన్‌చార్జిగా, సినిమా ఎడిటర్‌గా, చివరికి చీఫ్‌ రిపోర్టర్‌గా - వివిధ బాధ్యతలను నిర్వహించాను. 1960లో "వార్తలలోని వ్యక్తి" శీర్షికను ప్రారంభించాను. ఆ శీర్షికను "ఆంధ్రజ్యోతి"లో దాదాపు మూడు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి, రాశాను. ఆ తరువాత నేను ఆకస్మికంగా ఒక "యాక్సిడెంట్‌"కులోనై, ఆ పత్రికకు రాజీనామా చేశాను. ఆ తరువాత "వార్త" దినపత్రికలో జనరంజకమైన ఆ శీర్షికతో ఆయా ప్రముఖుల రేఖా చిత్రాలను రాయవలసిందిగా ఆ పత్రిక సంపాదకవర్గం కోరగా, ఈ శీర్షికను ఆ పత్రికకు మళ్లించాను. మొత్తం మీద 2010 నాటికి ఈ శీర్షికను దాదాపు 50 సంవత్సరాలు నిర్వహించాను. ఇంత కాలం ఒకే శీర్షికను ఒకే వ్యక్తి నిర్వహించం కూడా అరుదైన రికార్డే. అయితే, "వార్త" దినపత్రికలో ఈ శీర్షికను ప్రారంభించినప్పుడు నేను దానికి