పుట:Naa Kalam - Naa Galam.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంత ప్రాచుర్యం, ప్రాముఖ్యం లభిస్తుందని భావించలేదు. ఆ శీర్షిక వచ్చే రోజున "వార్త" దినపత్రికను దాని కోసమే కొనేవారున్నట్టు నాకు తెలిసి, ఆ శీర్షికను ఒక్క వారం కూడా మాని వేయకుండ నిర్వహిస్తూ వచ్చాను. ఆ శీర్షికకు ముఖ్యమంత్రులు, మంత్రులు, మేధావులు, రాజకీయ పార్టీల ప్రముఖులు, పత్రికా పఠనం పట్ల ఆసక్తిగల వారు ప్రత్యేక పాఠకులు. చివరకు, 1988లో నాకు జరిగిన ఒక సన్మాన సభలో ఆ తరువాత కేంద్రమంత్రి అయిన డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి నన్నే "వార్తలలోని వ్యక్తి"గా అభివర్ణించారు! ఒక్క మాటలో చెప్పవలెనంటే, ప్రజా జీవితంలో కాని, రాజకీయ రంగంలో కాని నాకు కొంత ప్రాచుర్యం లభించిందంటే, నా ఉపన్యాసాల తరువాత "వార్తలలోని వ్యక్తే" కారణ మనడంలో అత్యుక్తి లేదు!

1992 ప్రారంభంలో నేను "ఆంధ్రజ్యోతి" నుంచి రాజీనామా చేసిన తరువాత ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, సభలలో సమావేశాలలో ఉపన్యాసకుడుగా మరింత ప్రాచుర్యం సాధించాను. ఇక్కడి నుంచి రాయబోయే సంఘటనలు క్రమబద్ధంగా వుండవు. ముందుది వెనుక, వెనుకది ముందు పునరుక్తులు వుండవచ్చు! ఎందువల్లనంటే, ఇది ఇక్కడి నుంచి కేవలం "నా కథ" కాదు కనుక!

నేను యువదశలో ప్రవేశించే సమయంలో, అంటే 1946లో, దేశంలో ప్రధానమైన ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే.

"చెంప ఛెళ్లు"

ఆ జాతీయతా భావమే ఒకసారి మా అన్న గారి చేత నా చెంప ఛెళ్లు మనిపించింది! అది 1940వ దశకం. అప్పటికి నా వయస్సు సుమారు పది సంవత్సరాలు. అప్పుడు కృష్ణాజిల్లా బోర్డు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు జస్టిస్‌ పార్టీ అనే పార్టీ ఎక్కువగా జమిందార్లు, రాజాలు, సంపన్నులతో వుండేది.