పుట:Naa Kalam - Naa Galam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను కొంచెం ఆలోచించి "ఇప్పుడు నేను పని చేసే "ప్రతిభ"కు నాకు ప్రత్యామ్నాయంగా మరొకరిని కుదిర్చి వస్తాను" అని చెప్పాను.

అయితే, ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు ఆలస్యమైనది. ఈ లోగా మళ్లీ "ఆంధ్ర కేసరి" డాక్టర్ టి.వి.ఎస్‌.కు ఫోన్‌ చేశారు! కుటుంబరావును పంపించలేదేమని! నేను నాలుక కరుచుకుని, "ప్రతిభ"ను యజమాని రామారాయ్ కి అప్పగించి మద్రాసు పయనం కట్టాను. అంతటి "ఆంధ్ర కేసరి"కి దగ్గరగా వెడుతున్నందుకు నన్ను జర్నలిస్టుగాను, వక్తగాను రూపొందించిన గన్నవరం ఆనందంతో ఉప్పొంగింది! నాకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు జార్జి కారొనేషన్‌ క్లబ్‌లో వీడ్కోలు సమావేశం జరిపారు.

"ఆంధ్రకేసరి" శిష్యుడనైనందుకు ఆయన బాల్యంలోని ఒక పోలిక నాకు కూడా వచ్చింది. ఆయనకు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గురువుగా, మిత్రుడుగా, అడుగడుగునా మార్గదర్శిగా వున్నారు. నాకు గన్నవరంలో ఎందరో ఆత్మీయులైన అభిమానులు, మిత్రులలో ఒకరు, ఇక్కడ పేర్కొనదగిన వారు శ్రీ దాసరి పాపారావు. అడుగడుగునా నాకు ప్రోత్సాహ ఉత్సాహాలు కల్పించేవారు. నన్ను ఏవైనా రాజకీయ సభలకు తీసుకువెడితే, ఆయనే! అప్పటిలో నా మాన్‌ ఫ్రైడే ఆయనే!

ఇక మద్రాసు వెళ్లగానే సరాసరి "ఆంధ్రకేసరి" వుంటున్న మౌంట్‌ రోడ్‌లోని ప్రభుత్వ భవనంలోకి వెళ్లాను. ప్రకాశం గారు సాదరంగా, వాత్సల్యంగా పలకరించారు. "ఇక్కడి పద్ధతి ప్రకారం నిన్ను "ప్రజాపత్రిక" నిర్వాహకులు నలుగురు ఇంటర్‌వ్యూ చేస్తారు. మధ్యాహ్నం "ప్రజాపత్రిక" ఆఫీసుకురా!" అని చెప్పారు.

అక్కడ నన్ను పరీక్షించింది ఎవరో తెలుసాండీ? ఆంధ్రకేసరి ప్రకాశం, అంతకు పూర్వం మద్రాసు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన మహర్షి బులుసు