పుట:Naa Kalam - Naa Galam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయనకు తీవ్ర రాజకీయ ప్రత్యర్థి, అప్పటి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు "ఆంధ్రకేసరి" టంగుటూరి ప్రకాశం. ప్రకాశం వైఖరిని సమర్ధిస్తూ నేను "ప్రతిభ"లో ఎన్నో వ్యాసాలు రాశాను. అవి ప్రకాశం గారికి నచ్చేవి. అందువల్ల, తాను పెట్టబోయే "ప్రజా పత్రిక" తెలుగు దినపత్రికకు నన్ను సహాయ సంపాదకుడుగా తీసుకోవాలని ఆయన వుద్దేశం.

డాక్టర్ టి.వి.ఎస్‌.

ఈ విషయంలో మధ్యవర్తి అప్పటి విజయవాడ మున్సిపల్‌ చైర్మన్‌, ఆ తరువాత రెండుసార్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభ్యులైన డాక్టర్ టి.వి.ఎస్‌. చలపతిరావు గారు. డాక్టర్ టి.వి.ఎస్‌. ఉద్దండ రాజకీయవేత్త. గొప్ప వక్త. రచయిత. ఇంగ్లీషు, తెలుగు భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన బహుముఖ ప్రజ్ఞానిధి. ఎవ్వరినీ లెక్కచేయని స్వతంత్ర వ్యక్తిత్వం. వైద్యశాస్త్రంలో చదివింది ఎల్‌.ఎమ్‌.పి. అయినా, వైద్యంలో ఘటికుడు. ఇప్పటి ఎందరో అత్యున్నత డిగ్రీలున్న చాలా మంది వైద్యులకంటె ఆయనకు గల రోగనిదానశక్తి, చికిత్సా రీతి ప్రశంసనీయమైనవి. ఆయన "ఆంధ్రకేసరి" ప్రకాశం గారికి అత్యంత సన్నిహితులు. అంతేవాసి.

ఆయన ఒక రోజున నన్ను పిలిచి "పంతులుగారు మిమ్మల్ని తమ "ప్రజాపత్రిక"లోకి రమ్మంటున్నారు" అని చెప్పారు. (ప్రకాశంగారిని పెద్దా చిన్నలందరు "పంతులు గారు" అనే వ్యవహరించేవారు; సంబోధించేవారు).

"ఇప్పుడు ప్రతిభ"లో ఎడిటర్‌గా వున్నాను కదా!" అన్నాను

"అది చిన్న పత్రిక. పంతులు గారి పత్రిక దినపత్రిక. అందులో మీరు జర్నలిస్టుగా రాణిస్తారు. మీరు వెళ్లడం మంచిదని, మీ అభివృద్ధికి తోడ్పడుతుందని నావుద్దేశం".