పుట:Naa Kalam - Naa Galam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందుపై నేను తిరిగి లేఖ రాస్తూ "ఉదాహరణ ప్రాయంగా పేర్కొనే భాషలలోనైనా తెలుగుకు ప్రథమస్థానమివ్వాలని రాస్తూ, "ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌" నానుడిని తిరిగి ఉల్లేఖించాను. అలాంటి తెలుగును విస్మరించం వుద్దేశపూర్వకమేనని స్పష్టం చేశాను.

"నా ప్రియమైన తెలుగు భాషా రక్షకుడా! ("మై డియర్‌ గార్డియన్‌ ఆఫ్‌ తెలుగు") ఈ విషయంలో మన ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదన్న అంగీకారానికి వద్దా" మని రాజాజీ ప్రత్యుత్తరమిచ్చారు.

"ప్రతిభకు పిలుపు"

నేను కృష్ణాజిల్లా గన్నవరం నుంచి నాజర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించానని ఇంతకు పూర్వమే పేర్కొన్నాను.

1951 చివరలో గన్నవరం ప్రక్కనే వున్న కేసరపల్లికి ఆచార్య ఎన్‌.జి. రంగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అప్పటిలో ఆయన సొంత పార్టీ కృషి కార్‌ లోక్‌ పార్టీ అధ్యక్షుడు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత రైతు నాయకుడు. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో బలీయమైన రైతాంగ ఉద్యమాన్ని నిర్మించారు. అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌కు ఆయన వ్యవస్థాపకులు. ఆయన స్వాతంత్య్రోద్యమంలో జైలుకు వెళ్లినప్పుడు ఆయన సతీమణి శ్రీమతి భారతీదేవి రంగా ఆ సంస్థకు అధ్యక్షులుగా వున్నారు.

ఆచార్య రంగా తన స్వస్థలం గుంటూరుజిల్లా నిడుబ్రోలులో రైతాంగ విద్యాలయాన్ని నెలకొల్పి, దానిలో ఎందరో యువరైతు నేతలకు శిక్షణ ఇచ్చారు. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక మహాశక్తి. గొప్ప ఉపన్యాసకులు.

కేసరపల్లి సభకు నేను ఆయన ఉపన్యాసాన్ని వినడానికి వెళ్లినప్పుడు ఆయన నన్ను చూచి, "మీరు 'వాహిని'పత్రికలో పనిచేద్దురు గాని, విజయవాడ