పుట:Naa Kalam - Naa Galam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాశాను. అది అప్పటిలో "అనన్య ప్రచారం గల ఆంధ్ర దినపత్రిక" కావడం వల్ల నా లేఖ సంచలనమే కలిగించింది! అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర సమస్యలను గురించి నాకు చేతనైన రీతిలో ఆందోళన చేస్తూనే వున్నాను.

ముఖ్యంగా తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇవ్వాలని, తెలుగును భారతదేశంలో హిందీ తరువాత రెండవ అధికార భాష చేయాలన్న ఉద్యమాలను 2003 మే నెలలో నేనే ప్రారంభించానని వినమ్రతకు భంగం లేకుండా నేను చెప్పుకొనవచ్చు.

"గార్డియన్‌ ఆఫ్‌ తెలుగు"

Naa Kalam - Naa Galam Page 15 Image 0001
Naa Kalam - Naa Galam Page 15 Image 0001

1954లో ఇండియా మాజీ గవర్నర్‌ జనరల్‌ రాజాజీ (మహాత్మా గాంధి కడపటి కుమారుడు దేవదాస్‌ గాంధి ఆయన అల్లుడు) ఏదో ఒక సభలో మాట్లాడుతూ భారతదేశంలో ఉత్తమ భాషలుగా హిందీ, బెంగాలీ, తమిళ భాషలను మాత్రమే పేర్కొన్నారు కాని తెలుగు ప్రసక్తే లేదు!

ఆయనను తప్పుపడుతూ ఆయనకు లేఖ రాశాను. తెలుగును "ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌"గా పాశ్చాత్యులే పేర్కొన్నారని, తెలుగును భారతదేశానికి అధికార భాషగా చేయనగునని ప్రఖ్యాత బ్రిటీష్‌ జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జె.బి.ఎస్‌. హాల్డేన్‌ ఉద్ఘోషించారని, అలాంటి తెలుగు భాషను మీరు విస్మరించడం శోచనీయమని రాశాను.

అందుకు ఆయన సమాధానం రాస్తూ తాను కేవలం ఉదాహరణ ప్రాయంగానే కొన్ని భారతీయ భాషలను పేర్కొన్నానని, వాటిలో తెలుగుభాష లేకపోవడం కేవలం యాదృచ్ఛికమేనని ఆయన పేర్కొన్నారు.