పుట:Naa Kalam - Naa Galam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రండి" అని చెప్పారు. నేను చాలా చిన్నవాడినైనా ఆ నాటి అతిరథ, మహారథులైన మహానాయకులు అందరు - ఒక్క "ఆంధ్రకేసరి" ప్రకాశం గారు మినహా - నన్ను "ఏమండీ, మీరు" అనే వ్యవహరించేవారు. ఆ తరువాత నా కంటె చిన్నవారిని "ఏమండీ", "మీరు" అనడం వారి వద్దనే నేర్చుకున్నాను.

ఇక "వాహిని" కథ. అది ఆచార్య రంగా గారి తెలుగు వారపత్రిక. ఆయన కర్షక, రాజకీయ ఉద్యమాల ప్రచారానికి వుద్దిష్టమైన పత్రిక. చాలాకాలం మద్రాసు నుంచి, తరువాత విజయవాడ నుంచి వెలువడేది. ఆ పత్రికకు 1937లో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు పండిట్‌ నెహ్రూ ప్రారంభోత్సవం చేశారు. చాలాకాలం నడిచిన తరువాత అది 1970 దశకంలో మూతపడింది.

అయితే, ఆ పత్రికలో నేను సబ్‌ ఎడిటర్‌గా పనిచేసింది పట్టుమని రెండు నెలలైనా లేదు. ఎందువల్ల నంటే, కేవలం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి అనుకూలంగా రాయవలసిన పత్రిక; ఆ పత్రిక స్థాపనోద్దేశమే అది. అయినా, ఆ పత్రికే నా పాత్రికేయ జీవితానికి తొలిమెట్టు. అది 1951 చివరి మాట.

1952 ప్రారంభంలో ఒక రోజున విజయవాడ గాంధీనగర్‌లో ఏదో పెద్ద ఊరేగింపు వస్తూ వుంటే, ఆ జన సమ్మర్దాన్ని తప్పించుకోడనికి నేను ప్రక్కనే వున్న ఒక పెద్ద హోటల్‌ ముందు నిలబడ్డాను. అక్కడే శ్రీ చలసాని రామారాయ్ అనే ఒక "ఎమ్‌.ఎన్‌. రాయ్ అభిమాని" కూడా ఆ ఊరేగింపును తిలకిస్తున్నారు. మాటల సందర్భంలో ఆయన తాను "ప్రతిభ" అనే వారపత్రికను ప్రారంభిస్తున్నట్టు, దానికి నన్ను ఎడిటర్‌గా వుండాలని కోరారు. అది రాజకీయ వారపత్రిక; స్వతంత్ర వారపత్రిక. "వాహిని"లో చేరక పూర్వం నేను "ఫ్రీలాన్స్‌" జర్నలిస్టుగా శ్రీ ఖాసా సుబ్బారావు గారి సంపాదకత్వాన మద్రాసు నుంచి వెలువడిన "తెలుగు స్వతంత్ర" వారపత్రికలో దాదాపు రెండు సంవత్సరాలు వారం వారం విడవకుండా రాజకీయ వ్యాసాలు రాసేవాడిని. ఆ పత్రిక ఎప్పుడు