పుట:Naa Kalam - Naa Galam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిగిలినా, టిఫిన్‌ షెడ్‌ నిర్మాణం దానితో కాదు. అదే సమయంలో నేను ఇంతకు ముందే పేర్కొన్న "ట్రిపిల్‌ టైఫాయిడ్‌" రావడం, పునర్జన్మ, ఆ కథ తెలిసిందే. దానితో ఆ నాటకాల అంకానికి తెరపడింది! ఆ తెర తిరిగి లేవలేదు!

"స్వరాజ్యంలో స్వరాష్ట్రం"

పాత్రికేయ రంగంలో ప్రవేశించిన తరువాత నేను రాసిన ప్రథమ వ్యాసమేది? అని చాలా మంది అడుగుతుంటారు. 1947 వరకు మనం భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతూ వచ్చాము. దేశ స్వాతంత్య్రం ముఖ్యం కాబట్టి, ఆంధ్రరాష్ట్ర నిర్మాణంపై మన దృష్టి గట్టిగా పెట్టలేదు. అప్పటిలో ఆంధ్ర మహాసభ ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేస్తున్నా, అదే తక్షణావశ్యకతగా తెలుగు వారు భావించలేదు. ఆంధ్ర నాయకులందరు కాంగ్రెస్‌లో వుండి, దాని నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడం వల్ల ఆంధ్రోద్యమం గురించి పెద్దగా పట్టించుకోలేకపోయారు. 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్‌ ప్రధాని అట్లీ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తూ మరి 16 నెలలలో బ్రిటన్‌ భారత దేశానికి స్వాతంత్య్ర ప్రదానం చేసి, వైదొలగుతుందని ప్రకటించారు!

కాబట్టి, ఇక ఆంధ్రులు "స్వరాష్ట్రం" కోసం కృషిని తీవ్రతరం చేయవలసిన సమయం ఆసన్నమైనదని వివరిస్తూ "స్వరాజ్యంలో స్వరాష్ట్రం" అన్న శీర్షికతో అప్పటిలో మద్రాసు నుంచి వెలువడే "మాతృభూమి"అనే రాజకీయ వారపత్రికలో నా ప్రప్రథమ వ్యాసం రాశాను! అది 1947 మార్చి నెల.

నా ప్రథమ ఉపన్యాసం

ఆ తరువాత ఆరు నెలలకు - 1947 ఆగస్టు 15న - భారతదేశానికి