పుట:Naa Kalam - Naa Galam.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


స్వాతంత్య్ర ప్రదానం జరిగింది. అటు పిమ్మట 1947 అక్టోబర్‌లో గన్నవరం తాలూకా కాంగ్రెస్‌ కమిటి సమావేశంలో నా ప్రథమ ఉపన్యాసం చేశాను. అప్పటికి నా వయస్సు 14-15 సంవత్సరాలే! అయితేనేమి, అంతకు పూర్వం డిబేటింగ్‌ సొసైటీలో మాట్లాడిన అలవాటు వుండడం వల్ల నేను జంకూ గొంకూ లేకుండ నా ఉపన్యాస జీవిత "అరం గ్రేటం" చేశాను. ఆ సభలో ఆ తరువాత పి.సి.సి. అధ్యక్షులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పని చేసిన స్వాతంత్య్ర సమరయోధులు "ఉక్కు" కాకాని వెంకటరత్నం, శ్రీ పేట బాపయ్య, "మాతృ భూమి" పత్రిక వ్యవస్థాపకులు శ్రీ అన్నే అంజయ్య ప్రభృతులున్నారు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఈ 65 సంవత్సరాలుగా నా కలం నిర్విరామంగా ఆడుతూనే వుంది; నా గళం మ్రోగుతూనే వుంది!

అప్పటిలో పామర్రు నుంచి మా మకాం కృష్ణాజిల్లా గన్నవరం మారింది. అందువల్ల, నేను ఉపన్యాసకుడుగా గళమెత్తింది పామర్రు అయితే, నాకు జర్నలిస్టుగా రూపు కట్టింది గన్నవరం! అక్కడి నుంచే నేను పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాయడం ప్రారంభించాను. ముందు అప్పటిలో మద్రాసు నుంచి వెలువడే "ఆంధ్రప్రభ", "ఆంధ్రపత్రిక" దినపత్రికలకు సంపాదక లేఖలు రాసేవాడిని. అవి స్థానిక సమస్యలపై కాదు, రాజకీయ సమస్యలపైనే! అంతర్జాతీయ సమస్యలపై కూడా.

1947 ఆగస్టు 15న ఏర్పడిన స్వతంత్ర భారత తొలి మంత్రివర్గంలో ఒక్క ఆంధ్రునికైనా కూడా ప్రాతినిధ్యం లభించకపోవడం శోచనీయమని, "స్వాతంత్య్రోద్యమంలో అగ్రశ్రేణిలో నిలబడి అశేష త్యాగాలు చేసిన ఆంధ్ర జాతికివ్వవలసిన గౌరవమిదేనా? ఆంధ్రులలో కేంద్ర మంత్రిత్వం నిర్వహించగల దక్షులు కాంగ్రెస్‌ హై కమాండ్‌కు కానరాలేదా?" అని ప్రశ్నిస్తూ, "స్వతంత్ర భారతంలో ఆంధ్రులకు అన్యాయం" అన్న శీర్షికతో "ఆంధ్రప్రభ"లో ఒక లేఖ