పుట:Naa Kalam - Naa Galam.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆమె ఎక్కడవున్నదో, ఏమో! ఆ 14,15 సంవత్సరాల వయస్సులో చూడ్డమే! మళ్లీ చూడలేదు. చూడాలనివుంది; ఈ కథ చెప్పాలని వుంది! కాని, అసలు వున్నదో, లేదో?

చిన్ననాటి నాటకాల పిచ్చి

ఆ చిన్న తనంలో నాకు నాటకాల పిచ్చి, సంగీత ప్రియుణ్ణి. పాటలో ప్రావీణ్యం లేదు కాని, డైలాగులు చెప్పడంలో నైపుణ్యం వుండేది. అందువల్ల చిన్నప్పుడు నాటకాలు వేశాము - "గయోపాఖ్యానం", సంపూర్ణ రామాయణం". వాటికి దర్శకుణ్ణి నేనే. రెండింటిలోను హీరోను నేనే. "గయోపాఖ్యానం"లో కృష్ణుడు, "రామాయణం"లో రాముడు. మా తమ్ముడు పూర్ణచంద్రరావు "గయోపాఖ్యానం"లో అర్జునుడు, రామాయణంలో లక్ష్మణుడు. వాటిలో కిరీటాలు, మేకప్పులు మేమే తయారుచేసుకునేవారం. పెద్దల సమక్షంలోనే ప్రదర్శించాం. బాగుందనేవారు. మాతమ్ముడి పద్యానికి మెప్పు; నా గద్యానికి మెప్పు. అవి పిల్లల నాటకాలు!

పామర్రు నుంచి గన్నవరం వచ్చిన తరువాత హైస్కూలులో డ్రాయింగ్‌ మాస్టారు శంకరంగారికి నాటకాల పిచ్చి. ఆయన హార్మోనిస్టు కూడాా. ఆయన మాచేత "భక్త రామదాసు" నాటకం వేయించారు. యథా ప్రకారంగా "రామదాసు"లో నేను రెండవ రామదాసును. మొదటి "రామదాసు" మా తమ్ముడు. అతనిది పద్య ప్రధాన పాత్ర. నాది జెయిలు సీనులో "రామదాసు" పాత్ర. ఇంకా ఇతర విద్యార్ధులు ఇతర పాత్రలు వేశారు. టిక్కెట్లు కూడా పెట్టారు. సొమ్ము మిగిలితే, మా హైస్కూలులో విద్యార్థులు మధ్యాహ్నం పూట ఇంటి నుంచి టిఫిన్‌ క్యారియెర్లతో తెచ్చుకున్న భోజనం చేయడానికి టిఫిన్‌ షెడ్‌ నిర్మాణానికి వుపయోగించాలని వుద్దేశం. గన్నవరంలో రెండు సార్లు ప్రదర్శించిన "రామదాసు" నాటకానికి ఖర్చులు పోను కొద్దిపాటి సొమ్ము