పుట:Naa Kalam - Naa Galam.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరుచుకుపడేవాడు! దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్‌ ఫిలింఫాన్స్‌ అసోసియేషన్‌ నిర్వహణలో నాకు తోడుగా, నీడగా ఉండేవాడు. ఆయన 2010 లో దీర్ఘ వ్యాధితో దివంగతుడైనాడు ! అతడు లేని లోటు నాకు మానసికంగా తీరని లోటు. తన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ధీరోదాత్తంగా ఎదుర్కొన్నాడు. అరుదైన ఆప్తమిత్రుడు లక్ష్మీదాసు ! అతనిది విలక్షణ వ్యక్తిత్వం.

ఇక, జె.ఎస్‌.టి.శాయి. ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికి ఆయనది మరోపేరు. నాకు వీరాభిమాని. ఆయనను మా అమ్మగారు అంటూఉండేది, రామన్నకు లక్ష్మణుడులాంటివాడని! అంతకంటే ఏమి చెప్పాలి ? ఏ పని అప్పగించినా, దాన్ని సాధించుకు వచ్చేవాడు. నిజాయితీకి నిలువెత్తు చిరునామా. కారణాంతరాలవల్ల ఆయన హైదరాబాద్‌కు మకాం మార్చవలసి రావడం వల్ల నాకు ఒక చెయ్యి విరిగినట్టయింది. హైదరాబాద్‌లో ఉన్నా, ఎప్పుడూ నా యోగ క్షేమాలను గురించి తెలుసుకుంటానే వుంటాడు.

మల్లాది రామకృష్ణ నాకు "మౌనభక్తుడు". ఎక్కువగా మాట్లాడడు. కార్యవాది. నాకు కొండంత అండగా నిలబడినవాడు. లోకం దృష్టిలో ఆయనపేరు "తుర్లపాటి శిష్యుడు" అంటే, ఇక వేరే చెప్పేదేమున్నది? నా దివంగత శ్రీమతి "నాట్యరాణి" తుర్లపాటి కృష్ణకుమారి పేరిట "కృష్ణ కళాభారతి" అనే సాంస్కృతిక సంస్థను నెలకొల్పి, ఇప్పటికి మూడు దశాబ్దాలుగా ఆమె జయంత్యుత్సవాలను ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా నిర్వహిస్తూ, విజయవాడలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన కళాభిమాని.

ఈ ముగ్గురూ నా ఉన్నతికి ఎంతగానో దోహదం చేసిన "ముగ్గురు మిత్రులు". నా జీవితం పై వారి ప్రభావం ఎంతటిదో వారి జీవితాలపై నా ప్రభావం కూడా అంతటిదేనని వేరే చెప్పనక్కరలేదు. అయితే, నా పురోగతికి అనుక్షణం నాతోనే ఉండి, నన్ను ముందుకు నడిపించిన వారిలో వీరు