పుట:Naa Kalam - Naa Galam.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాధపడుతున్నాను. నా ఉద్దేశం మీ ముఖ్య మంత్రిని కాని, మీ రాష్ట్ర ప్రజలను కాని కించపరచడం కాదు. మా స్విట్జర్లెండ్‌లో అయితే, కొద్ది కాలంలో అంత అభివృద్ధి సాధించడం అసాధ్యమని, అలా సాధిస్తామని అక్కడ మేము ఎవరైనా అంటే మమ్మల్ని జెయిలుకో, పిచ్చి ఆసుపత్రికో పంపిస్తారన్న ఉద్దేశంతో నేను అన్నాను. మీ ముఖ్యమంత్రి స్వల్పకాలంలో అనల్పమైన అభివృద్ధి సాధించ గల సమర్ధునడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని, మీ రాష్ట్ర ప్రజలను బాధపెడితే నన్ను మన్నించండి. ఈ లేఖను మీరు పత్రికలకు విడుదల చేయండి " అని అనునయంగా, సంజాయిషీ ధ్వనిస్తున్నట్టుగా రాశారు.

ఆయన కోరినట్టుగానే నేను ఆ లేఖను అన్ని పత్రికలకు విడుదల చేశాను. ఈ లేఖ రాష్ట్రంలో కొంత సంచలనమే కలిగించిందని చెప్పవచ్చు. స్విస్‌ ఆర్థిక మంత్రి లేఖ కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా పంపాను. ఆ కాపీ తనకు చేరినట్టు ఆయన నాకు తెలియజేయలేదుకాని, దాన్ని ఆ తరువాత రాష్ట్ర అసెంబ్లీలో ఒక సన్నివేశంలో తన "ఆత్మ రక్షణ"కు ఉపయోగించుకున్నారు. అందులో తప్పేమీ లేదు !

అసెంబ్లీలో స్విస్‌ మంత్రి లేఖ :

ఆ తరువాత ఒకసారి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక విషయాల పై చర్చజరుగుతున్నది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికాభివృద్ధిని సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని, అది అంత సులభం కాదని పేర్కొంటూ, స్విస్‌ ఆర్థిక మంత్రి పాస్కల్‌ "జెయిలు, పిచ్చాసుపత్రి" వ్యాఖ్యలను ఉదహరించారు.

వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేచి, స్విస్‌ ఆర్థిక మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ ఒక ప్రముఖ జర్నలిస్టుకు లేఖ