వ. అని ప్రార్థించిన విని పార్థివేంద్రుఁడు డిల్లపడి తల్లడిల్లుచు నుల్లంబు గలంగి ముసుంగిడి యచ్చేడియ పలికిన పలుకులకు మాఱాడ నోడి మిన్నక యున్న యున్న సమయంబున, సుమంత్రుం డేతెంచి "స్వామీ ! రామచంద్రుని బట్టంబు గట్ట సుమూహుర్తం బాసన్నం బయ్యెఁగావున మిమ్ము నచ్చటికి విచ్చేయ నవధరింపుఁ" డని వశిష్ఠ భగవానుండు విన్నవించు మని పంపె నని చెప్పిన కైక యిట్లనియె : ||27|
మ. అనిలో మున్ను నృపాలు చిత్తము కేనహ్లాదముం గూర్చి, నా
తనయుం బట్టము గట్టి, రాఘవుని బద్నాలుగేండ్లు కాంతారమం
దును వర్తిల్లఁగఁబంపఁగొన్న వరమున్ ద్రోయంగరా దెంతయున్
వనసీమన్ ముని వృత్తి నుండు మనుఁడీ వైళంబ యా రామునిన్ ||28||
క. అని పలుకు కైక పలుకులు
విని వేగము మరల వచ్చి విన్నఁదనంబున్
దనుక వశిష్ఠునితోడన్
వినుపించె సుమంత్రుఁ డట్టి విధ మేర్పడఁగన్. ||29||
సీతా లక్ష్మణులతొ శ్రీరాముని యటవీ నిర్గమనము
వ. అనిన విని వశిష్ఠాది ప్రముఖులును, సుమంత్రాది ప్రధాన జనంబులును, సైన్యంబులును, బరివారంబులును విన్ననై యున్న నా సన్న యెఱింగి, రామచంద్రుండు రాజ చిహ్నంబులు త్యజించి, జటా విభూతి వల్కలంబులు దాల్చి, ధనుర్ధరుండై యున్నంత; లక్ష్మణుండును భూ పుత్రికయును దోడం జనుదేరఁ, దల్లులకు నమస్కరించి, వశిష్ఠానుమతంబున నాశీర్వచనంబులు గైకొని, యాస్థానంబు వెలువడి యరణ్యంబున కరుగునప్పుడు పుర జనులందఱును బురపురం బొక్కుచు, దశరథ మహారజును దూషించుచుఁ, గైకను నిందించుచు, మూఁకలై శోకించుచుండనది యంతయు విని దశరథుండు పురోహితామాత్యబంధు