బాల కాండము
స్థిరముగ వేదిమధ్యమునఁ జేర్చిన దానికి ధూపదీపముల్
విరులును గంధ మక్షతలు వేడుక నిచ్చిరి చూడనొప్పగన్.
వ.అట్టి సమయంబున జనకభూపాలుండు రాజకుమారులం
గనుంగొని ఇట్లనియె. |69|
ఉ.కొంకక సావధానమతిఁ గూర్చి వినుం డిదె మత్కుమారికై
యంకువ సేసినాఁడ వివిధోజ్వల మైనధనంబుఁ గాన నీ
శంకరు చాప మెక్కిడిన స్త్త్వఘనుండగువాని కిత్తు నీ
పంకజనేత్ర సీత నరపాలకులార నిజంబు సెప్పితిన్. |70|
ఆ.అనుచుబలుకుచున్న అవనీశతిలకుని
వాక్యములకు నుబ్బి వసుమతీశ
నుతులు దాముదామె మతిలోనఁ జెలఁగుచు
దగ్గఱంగఁ బోయి ధనువు జూచి. |71|
క.విల్లా ఇది కొండా యని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదు లగునృపనందను
లెల్లరు దౌదల నుండి రెంతయు భీతిన్. |72|
క.కొందఱు డగ్గర నోడిరి
కొందరు సాహసము చేసి కోదండముతో
నందంద పెనగి పాఱిరి
సందుల గొందులను దూరి సత్వము లేమిన్. |73|
సీ. గాలిఁ దూలినరీతిగా నెత్తఁ జాలక
తముఁ దామె సిగ్గున దలను వంచి
కౌఁగిలించిన లోను గాక వెగ్గల మైన
భీతిచే మిక్కిలి భీరువోయి
పుట:Molla Ramayanam.djvu/26
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది