పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

మీఁగడ తఱకలు


పదములు, గొబ్బిపదములు, కోవెలపదములు, చిలుకపదములు, అల్లొనేరేళ్ళు, సీస-కందార్ధములు, త్రిభంగులు, ద్విపదలు, త్రిపదలు, చౌపదలు, షట్పదలు, మంజరులు, జక్కుల రేకులు మొదలగునవి.

యక్షగానము లిట్లు వెలసినను ప్రాచీనము లయినకురవంజి రచనములును యక్షగానరచనావిధానసంకలితములై ఈకాలమునఁ గూడఁ గొన్ని సాఁగుచునే వచ్చినవి. దేవోత్సవరాజాస్థానాదులం దిట్లు వేశ్యలచేఁ బ్రదర్శింపఁబడుచున్న యక్షగానములు పెంపొందుచుండు నీకాలమున, దక్షిణదేశమున విజయనగరరాజ్యమున కుపశాఖలుగా తంజావూరు మధురరాజ్యము లాంధ్రనాయక రాజుల పరిపాలనమున వెలసినవి. ఆంధ్రదేశమునందును, దక్షిణ దేశమునందును నీకాలమున యక్షగానరచనము మిక్కిలి ప్రబలఁ జొచ్చెను. ఇవి యిట్లు కలావతులచేతఁ బ్రదర్శింపఁబడుచున్న వౌట కొఱఁతగాఁ గనిపట్టియో యేమో కాని, కృష్ణాతీరమునందలి కూచిపూఁడిగ్రామమున సిద్దేంద్రుఁ డనుయోగి యొకఁడు భాగవతకథలను పారిజాతము, గొల్లకలాపము మొదలగు పేళ్లతో యక్షగానములుగా రచియించి శాస్త్రీయ మయినభరతనాట్య సంప్రదాయములకు రక్షగా, స్త్రీనిస్సహాయముగా, నాయూరి బ్రాహ్మణులచేతనే ప్రదర్శినము చేయింప నేర్పాటు చేసెను. ఆయూర జన్మించిన బ్రాహ్మణుఁ డెవ్వఁడు గాని, ఒక్కతూరియైనను, యక్షగానప్రదర్శమున స్త్రీవేషమును ధరించి తీరవలె ననియు, నది వారికులాభ్యుదయహేతు వనియుఁగూడ శాసించెనఁట. నేఁడుకూడ కూచిపూఁడి బ్రాహ్మణులు శాస్త్రీయమయిన భరతనాట్యముతో భాగవతకథలను బ్రదర్శించువారుగా నున్నారు. ఈసంప్రదాయము వెలసినపిదపనే తత్ ప్రదర్శకులకు భాగవతు లనియు, తద్రచనములకు ఆటభాగవతము లనియుఁ బేరయ్యెను.