పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

77


ఆటభాగవతములు

ఈ భాగవతకథలలో పారిజాతహరణకథ హృద్యతర మగుటచే దానికిఁ బ్రచార మెక్కువయ్యెను. అది హృద్యతర మగుట కందలి సవతుల కయ్యపుఁబట్టు ప్రధానకారణము. దీనినిఁ బట్టి యక్షగానసామాన్యమునకుఁ బారిజాతము లనియుఁ బేరయ్యెను. ఏయక్షగానముఁ బ్రదర్శించినను నందు సవతుల కయ్యపుఁబట్టునకుఁ బ్రసక్తి గల్పించుటయో లేక పారిజాతమునందలి తత్కథాఖండమునే స్వంతంత్రముగాఁ బ్రదర్శించుటయో పిదప నేర్పడెను. ఈసవతులకయ్యపుఁగథపట్టు హృద్యతర మగుటచేఁ బ్రబంధకవులనుగూడ నిది వలపించెను. కళాపూర్ణోదయమున పింగళి సూరన్న పారిజాతకథలోని సవతుల కయ్యపుఁబట్టు ని ట్లనుకరించెను.

అంత మదింపకువేయని పల్కిన నంత మదింపకువే యనుచున్
గంతు లడంచెడ లెమ్మని పల్కిన గంతు లడంచెద లె మ్మనుచున్
రంతుల నేమి ఫలం బని పల్కిన రంతుల నేమి ఫలం బనుచున్
బంతము చూడఁగదే యని పల్కినఁ బంతము చూడఁగదే యనుచున్,

సీ|| ఒట్టుసుమీ యన్న నొట్టుసుమీ యంచు
               నే నేమి యనిన నే మేమి యనుచుఁ
      గానీగదే యన్నఁ గానీగదే యంచు
               నింకేల యనిన నింకేల యనుచు
      నోసి పోవే యన్న నోసి పోవే యంచు
               నౌనంటి ననిన నౌనంటి ననుచు
      మఱువకు మిది యన్న మఱువకు మిది యంచు
               నీ వెంత యనిన నీ వెంత యనుచు
      నొకతె మగనికి నాసించు టొప్పదనిన
      నొకతె మగనికి నాసించు టొప్ప దనుచుఁ
      బట్టియాడె నారంభతోఁ బ్రథమరంభ
      ప్రియుఁడు నిలుమన్న నిలువక పెద్దరొదగ
                                            కళా, ఆ, 3-195, 196