పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

మీఁగడ తఱకలు


రాత్రులందు నృత్యవిశేషములు నెఱపి ధనార్జనము చేయుచుండువారు. అక్కడక్కడి కొరవజాతులవారు చేయునృత్యములు కొరవంజులనఁబడెను. కొరవంజె యన్నపేరు తొలుత వారి నృత్యమునకును, బిదప నృత్యవిశిష్ట మయిన వారిచిన్నచిన్నగేయరచనలకును, నాపై కురవజాతి వారికినిగూడఁ బేరైనది. కురవజాతి వారు తొలుత చేయునృత్యవిశేషముకాలక్రమమున నాయాపర్వతప్రదేశముల స్థలమాహాత్మ్యకథలతోను, శివవిష్ణలీలాకథలతోను మిళితము లయి గేయవిశిష్టనాట్య రూపములనుబడసెను. అపుడు మాయాకిరాతవేషు లగుపార్వతీశివుల కథలతోనున్న కిరాతార్జునీయము, నృసింహస్వామి చెంచీతను బెండ్లాడుస్థల మాహాత్మ్యకథలు (చెంచీతకథ) కురవంజులుగా వెలసెను. ఇట్లు వెలసినయాదృశ్యరచనములు తొలుత నత్యల్పముగా గేయభాగములును విశేషముగా నృత్యమును గలవై యుండెను. అవి సింగి, సింగఁడు-అని యిద్దఱు పాత్రములు గలవై సంస్కృత వీధినాటకములఁ బోలియున్నవి. సింగి, సింగఁడు సంస్కృత నాటకములలోని నటీనటులవలె నాలుమగండ్రు. వీరిద్దఱే కథాపాత్రము లగుచుందురు. కొన్నింటఁ గథాసంధాయకుఁడు -సంధివచనములఁ జెప్పువాఁడు-విదూషకుఁ డనందగినవాఁడు - మూఁడవపాత్రము-కోణంగి యనువాఁడు - (పిదప చోడిగాఁడు) కాన నగును. కోణంగి సంస్కృత నాటకములలోని విదూషకస్థానీయుడగుట స్పష్టముగాఁ గానవచ్చును. సంస్కృతనాటకములలోని ధ్రువాగానమే కురవంజులలో దరు వనఁబడెను. దేశిరచనలలోనుండి సింగి, సింగఁడు, కోణంగి, దరువు అనునవి నటీనటులుగను, విదూషకుఁడుగను, ధ్రువగను సంస్కృత నాటకములఁ జేరెనేమో యనికూడ యోజింపఁ దగినట్టున్నది. ఎంతో కాల మిట్లు కొండపట్టులందు సాఁగుచుఁ బెంపొందినగేయనృత్యసందర్భములు నగరములకుఁగూడఁ గ్రమముగా వ్యాపించినవి. చెంచులు, కురవలు నడవులనుండి పులిగోళ్ళు,