పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

71


బేర్కొన్న సోమనాథుని కిన్నూఱేండ్ల పూర్వకాలమునఁగూడ నుండుట సంభావ్యమే. తెలుఁగునకు సాటిభాష లగుద్రవిడ కర్ణాటభాషల పద్ధతులను బట్టియుఁ దెలుఁగులో నిప్పు డుపలభ్యమానము లగుచున్నకొన్ని ప్రాచీనదృశ్య రచనములతీరులనుబట్టియు, ద్రావిడభాషాసామాన్యముగాఁ దొలుత వెలసిననాటకరచనల స్వరూపము కొంత గుర్తింపవచ్చును.

కురవంజి[1]

తొలుత ద్రావిడభాషలలో వెలసినదృశ్యరచనములు కురవంజు లనఁబడునవి. అంధ్రకర్ణాట ద్రవిడదేశముల యరణ్యములలో వసించు నాటవికులు, చెంచులు, కురవలు (క్రోవ, కోయ) అనువారు. అందుఁ గురవజాతివారి యంజె=అడుగు (నృత్యవిశేషము) కురవంజె[2] యనఁ బడెను. చిందు, గంతు, గొండ్లి, అంజె, అంగ-ఇత్యాదులు నృత్య విశేషములు. ఆంధ్రదేశమున బహుకాలముననుండి శివక్షేత్రము లగుశ్రీశైలము ఇంద్రకీలనగము (బెజవాడకొండ) మొదలగుపర్వతముల మీఁదను, నృసింహక్షేత్రము లగువేదాద్రులు (పెక్కులున్నవి. మంగళాద్రి, సింహాద్రి, గరుడాద్రి, మాల్యాద్రి, వెంకటాద్రి,) మొదలగుపర్వతములమీఁదను వర్షోత్సవములు (యాత్రలు, జాత్రలు, జాతరలు) జరుగునప్పు డక్కడికి నాగరకప్రజలు చేరుచుండువారు. వారివినోదమునకై యక్కడి యాటవికులు

  1. . వాల్విచి గుజ్జరి విల్వేడు(?) దండలాస్యము కందుకక్రీడ యల్లికయును కొరవంజి(జె) శుభలీల గుజరాతి దేసి చౌపదము జక్కిణి దురుపదము మదన పదదౌత్యమును జోగిపదచాళి శారదాసామ్రాజ్యమును జిందు సవతిమచ్చరంబులు నాట్యకదంబంబు మొదలైన నాట్యముల్ హవణించునవరసజ్ఞు (విజయరాఘవనృపాలుని ప్రహ్లాదచరిత్ర-యక్షగానము) ఇందు 'కొరవంజి' నృత్యవిశేషముగానే పేర్కొనఁబడినది.
  2. . కురవంజి, కురవ+అంజె (అంజ, అంజె, అంజియ రూపాంతరములు) కురవంజియ కురవంజెలనుండి కురవంజి అనురూప మేర్పడి యుండవచ్చును.