పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

మీఁగడ తఱకలు


యక్షగానములు

ఇప్పుడు పేర్కొనఁబడిన రచనములు గాక యక్షగానరూపముగా నున్నభాగవతరచనము లనేకము లున్నవి. అందుఁ గొన్ని రసోత్తరము లయినవి. సిద్దేంద్రుఁ డనుయోగి రచించినగ్రంథము వానిలోఁ బ్రఖ్యాతము. కూచిపూఁడి (కృష్ణా మండలము) బ్రాహ్మణులు పారంపర్యముగా నాయతీంద్రునికృతిని బ్రదర్శింతురు. ఇంక నసామాన్యముగాఁ బేర్కొనఁ దగిన దింకొకటి కలదు. సంస్కృతమునఁ గృష్ణలీలాతరంగిణి యనుపేర భాగవతదశమస్కంధమును గేయరూపమున రచించినమహనీయులు నారాయణతీర్థులవారు తెలుఁగున రచించినపారిజాతకథ, ఇది భాగవత మందలి పారిజాతాపహరణకథమాత్రమే.

మీఁదఁ బేర్కొనఁబడిన కవీశ్వరుల రచనములలోనఁ బ్రఖ్యాతము లయినవానినుండి మచ్చుతునుకలఁ జూపుదును,

భాగవతము

హరిభట్టు-షష్ఠస్కంధము

గీ|| శ్రీసమేత! మిమ్ము సేవింప నొల్లక
     మీఱి శుభము లొందఁ గోరువాఁడు
     చెంగలించి శునకలాంగూలముఖమున
     నదిని దాఁటఁ గోరునట్టివాఁడు.

చ|| అరయఁగఁ బద్మసంభవుఁడు నాత్మనివాససరోజకర్ణికాం
     తరమున నుండి తీవ్రపవనప్రహితాధికవీచిమాలికా
     పరిమితఘోషభీషితవిభావ్యమహార్ణవమందు మగ్నుఁడై
     పరువడితో మిముం దలఁచి పారము నొందఁడె భక్తవత్సలా!

శా|| ఓ రాజీవదళాభిరామనయనా! యోసత్యసన్మంగళా!
      యోరాత్రించరకంఠనాళదళనా! యోసర్వలోకాధిపా!
      యోరత్నాకరమేఖలాపరివృధా! యోభక్తకల్పద్రుమా!
      యోరాకాహరిణేందురమ్యవదనా! యోపద్మనాభాచ్యుతా!