పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

63


ఈతని పద్యగ్రంథ మింతవఱకు ముద్రితము గాకుండుట శోచనీయము. ఈతనిద్విపదరచనము కొంత యిటీవల ముద్రిత మయినది. కాని యదికూడ సమగ్రముగాఁ బ్రకటితము కావలెను.

తేకుమళ్ల రంగశాయికవి

ఈతఁడుకూడ భాగవతమును ద్విపదరూపమునఁ దెనిఁగించినాఁడు. కోనేరునాథునిద్విపద సంగ్రహముగా నున్నది గాని యీతని ద్విపద విస్తృతముగా నున్నది. పుష్పగిరితిమ్మకవిసాహాయ్యమునఁ దా నాగ్రంథము రచించినట్టు కవి చెప్పుకొన్నాఁడు. వాణీవిలాసవనమాలికాది బహు గ్రంథముల నీతఁడు రచించినాఁడు.

పుష్పగిరితిమ్మకవి

ఈతఁడు ద్విపదభాగవతరచనమున రంగశాయికవికిఁదోడుపడుటే కాక తెనుఁగున వచనభాగవతమునుగూడ రచించినాఁడు. అది తేటగా నున్నది. దానిఁ జూచి తదనుసారముగా నరవమున నొకకవి వచన భాగవతము రచించినాఁడు,

తరిగొండ వేంకమాంబ

ఈమెకూడ భాగవతమును ద్విపదరూపమున రచించెను. ఈమె గ్రంథము ఓరియంటల్‌లైబ్రరిలో నున్నది. వేఱొకప్రతి క్రొత్తగా చిత్రాడలో నాంధ్రపరిశోధకమండలివారికి దొరకినది. అది యింతవఱకుఁ బ్రఖ్యాత మయినది గాదు. మహనీయురాలగుస్తీరచించిన దగుటచేతను సుకుమారకవిత యగుటచేతను నిది ప్రకటింపఁదగినది.